Coalition Government Planning to Give House to Poor People : 'జగనన్న కాలనీల పేరుతో ఏకంగా ఊళ్లకు ఊళ్లే నిర్మించేస్తున్నాం. సెంటున్నర స్థలంతో పాటు, పక్కా ఇల్లు కూడా సాకారం చేసి అందిస్తున్నాం' అంటూ మాజీ సీఎం జగన్ పదేపదే ఊదరగొట్టారు. ఈ ఆర్భాటపు ప్రచారానికి, క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితికి పొంతన లేకుండా పోయింది. నాలుగేళ్లు దాటినా జిల్లాలో వేలమందికి స్థలం దక్కలేదు. సొంతింటి కల సాకారం కాలేదు. ఇప్పుడు వీరందరికీ మేలు చేకూర్చేలా కూటమి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
వేల మందికి మొండిచేయి :ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అర్హుల్ని గుర్తించి 2020 డిసెంబర్ 25 నుంచి గ్రామాల వారీగా పట్టాల పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. చాలా గ్రామాల్లో భూ సేకరణ జరపకపోవడం, పొరుగు గ్రామాల్లో స్థలాలు కేటాయించడంతో పట్టాలు తీసుకునేందుకు లబ్ధిదారులు నిరాకరించారు. మరోపక్క ఇంటి స్థలం కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని వారికి 90 రోజుల్లోగా పట్టా ఇస్తామని ఘనంగా హామీలు ఇచ్చారు. చివరకు మొండి చెయ్యి చూపారు. చాలాచోట్ల భూసేకరణకు వీలుగా రంగం సిద్ధం చేసినా ప్రభుత్వం చెల్లింపులు జరపలేదు.
గన్నవరమే నిదర్శనం : ఇళ్ల స్థలాలు అందాల్సిన వారిలో దాదాపుగా సగం మంది గన్నవరం నియోజకవర్గానికి చెందిన వారే ఉండడం గమనార్హం. నియోజకవర్గంలోని మూడు ప్రధాన మండలాల్లో కలిపి 23,781 మందిని అర్హులుగా నిర్ధారిస్తే వీరిలో ఇంకా 9,027 మందికి పట్టాలు, స్థలాలు ఇవ్వలేదనేది గత ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. మచిలీపట్నం, పామర్రు, పెనమలూరు మినహా మిగతా ఏ మండలంలోనూ కూడా వెయ్యికు మించి స్థలాలు ఇవ్వలేదు.
ఎట్టకేలకు ఉపశమనం:రెండు జిల్లాల్లో ఆర్భాటంగా కొన్నిచోట్ల చెరువుల్లో లేఔట్ వేసి ఇళ్ల స్థలాలిచ్చేశారు. కానీ వీటిని 22ఏ జాబితాల్లోంచి తొలగించలేదు. లేఔట్లను అభివృద్ధి చేయలేదు. దీంతో లబ్ధిదారులకు పట్టాలు మాత్రమే దక్కాయి. వీరందరికీ మేలు చేకూర్చేలా కూటమి ప్రభుత్వం త్వరలో 3 సెంట్లు చొప్పున స్థలం ఇచ్చేలా రంగం సిద్ధం చేస్తుంది.