CM Revanth Reddy Mahabubnagar Tour : అధికారిక పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పాలమూరు కలెక్టరేట్‌కు చేరుకోనున్న ఆయన తొలుత ఉమ్మడి జిల్లా ప్రముఖులతో సమావేశమవుతారు. అనంతరం మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం సహా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్లో పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం భూత్పూర్ రోడ్డులోని ప్రైవేట్ ఫంక్షన్హాల్లో ఉమ్మడి జిల్లా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు.
ప్రజాప్రతినిధులతో సమీక్ష :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లావాసి కావడంతో సమీక్ష తర్వాత జిల్లా సమగ్రాభివృద్ధికి ఏ నిర్ణయాలు తీసుకుంటారోనని జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, విద్య, వైద్యం, పర్యాటకం, మహిళా సాధికారత సహా ఇతర అంశాలు ప్రధాన ఎజెండాగా సమీక్ష జరపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాల్సిన అంశాలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహా జిల్లా అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు కావాల్సిన పనులపై అధికారులకు నివేదిక సమర్పించారు.
'అభివృద్ధే వైఎస్సార్ ఆశయం - రాహుల్‌ను పీఎం చేయాలన్నదే ఆయన లక్ష్యం' - CM REVANTH REDDY ABOUT YSR
కీలకమైన అంశాలపై చర్చ :సాగునీటి రంగం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్య, వైద్యం, మహిళా సాధికారత, పర్యాటకం సహా ఇతర అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. ఉమ్మడి జిల్లాకు జేఎన్టీయూ కళాశాలలు, పాలమూరు విశ్వవిద్యాలయం అభివృద్ధి, సర్కారీ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన.. జిల్లా కేంద్రంలో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తి, పరిశ్రమల ఏర్పాటు, నల్లమల ఎకో టూరిజం, పర్యాటక హబ్‌గా పాలమూరును అభివృద్ధి చేసేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలపై సీఎం సమీక్షిస్తారు.