CM Revanth Reddy Met UPSC Candidates : తెలంగాణలోని నిరుద్యోగుల సమస్య పరిష్కారమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యతని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏటా జూన్ 2న నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9లోపు ఉద్యోగాలిచ్చేలా జాబ్ క్యాలెండర్ రూపొందించినట్లు వెల్లడించారు. సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరఫున సాయమందిస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. అభ్యర్థుల సమస్యలను సహృదయంతో అర్ధం చేసుకుని గ్రూప్-2 పరీక్ష వాయిదా వేశామని ముఖ్యమంత్రి వివరించారు.
అంతకుముందు హైదరాబాద్ ప్రజాభవన్‌లో సింగరేణి సంస్థ సహకారంతో రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన 41 మందికి లక్ష చొప్పున ఆర్థికసాయం అందించారు. నిరుద్యోగ యువతకు మేమున్నామనే మనోధైర్యం కల్పించేందుకే మంత్రివర్గ సహచరులంతా పాల్గొన్నట్లు సీఎం వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్ని భర్తీ చేస్తామని హమీ ఇచ్చారు. ప్రభుత్వంపై అభ్యర్థులకు నమ్మకం కలగాలనే త్వరగా నోటిఫికేషన్లు ఇస్తున్నామన్న ఆయన, ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నామని వివరించారు. జూన్ 2న నోటిఫికేషన్, డిసెంబర్ 9లోపు ఉద్యోగాలు ఇచ్చేలా జాబ్ క్యాలెండర్ రూపొందించారని తెలిపారు. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు కచ్చితంగా జాబ్ సాధించాలని ఆకాంక్షించారు. సివిల్స్ సాధించి రాష్ట్రానికే రావాలని అభ్యర్థులను కోరారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు తెలంగాణవారైతే రాష్ట్రానికి ఇంకా మంచి జరుగుతుందన్నారు.
సీఎంఓ అధికారులకు బాధ్యతలు కేటాయింపు - ఎవరికి ఏ శాఖ అంటే ! - Departments to CMO Officers