CM Revanth Face to Face with the Promoted Teachers : 'కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను కలవాలని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశాం.కోదండరామ్‌కు విజ్ఞప్తి చేసి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయించాం. తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుందని అడిగితే ఎల్బీ స్టేడియంలోని ఉందని చెప్తాను. వేలాది మంది ఉపాధ్యాయుల చేతుల్లో తెలంగాణ భవిష్యత్తు ఉంది. తమ పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు ఇచ్చారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీపే ఉంది. తెలంగాణ ఉద్యమంలో టీచర్లు పోషించిన పాత్ర మరువలేనిది.' అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు ఆత్మీయ సమ్మేళనం పేరుతో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు.
రాష్ట్రం సాధించుకున్నాక ఉపాధ్యాయులకు గౌరవం దక్కుతుందని అనున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉపాధ్యాయులకు గౌరవం లేదన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఏవిధంగా అవమానించిందో అందరూ చూశారని ఆవేదన చెందారు. విద్యాశాఖకు బడ్జెట్లో రూ.21 వేల కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఉపాధ్యాయులకు చెప్పారు. 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థులు ఉన్నారన్నారు. 10 వేల ప్రైవేటు పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని వివరించారు.
అందుకే విద్యావ్యవస్థలో ఎక్కడో లోపం ఉందని, ప్రభుత్వం నుంచి ఉన్న లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. పదేళ్లుగా టీచర్లకు ఏనాడు ఒకటో తేదీన జీతాలు పడలేదని ధ్వజమెత్తారు. యజమాని మీద విశ్వాసం ఉన్నప్పుడే ఉద్యోగి నిజాయితీగా పని చేస్తాడని అన్నారు. గత యజమాని కేసీఆర్‌పై ఉపాధ్యాయులకు ఎప్పుడూ విశ్వాసం లేదని విమర్శించారు. ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించడానికి ఎవరైనా వస్తే వెంటనే స్పందించానని తెలిపారు.