CM Revanth Revealed Details of Samagra Kutumba Survey Details :రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే, సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి నివేదికను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. సమగ్ర ఇంటింటి కుల సర్వేను ఫిబ్రవరి 2024లో నిర్వహించినట్లు తెలిపారు. సర్వేకు ముందు కర్ణాటక, బిహార్ సహా వివిధ సర్వేలను క్షుణ్నంగా అధ్యయనం చేశామన్న ఆయన, సర్వేల తయారీలో వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నామని వివరించారు.
రాష్ట్రంలో దాదాపు 50 రోజులపాటు సర్వే జరిగిందని, గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాల్లో, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1.12 కోట్ల కుటుంబాల సర్వే జరిగిందని, 3.56 లక్షల కుటుంబాల్లో సర్వే జరగలేదని చెప్పారు. ఈ సర్వే డేటాను సంక్షేమ విధానాల తయారీకి వాడుతామని తెలిపారు.
కుల సర్వే ప్రకారం కులాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి
కులం
సంఖ్య
శాతం
ఎస్సీ
61,84,319
17.43
ఎస్టీ
37,05,929
10.45
బీసీలు (ముస్లిం మైనార్టీ మినహా)
1,64,09,179
46.25
ముస్లిం మైనార్టీలు
44,57,012
12.56
ముస్లిం మైనార్టీల్లో బీసీలు
35,76,588
10.08
ముస్లిం మైనార్టీల్లో ఓసీలు
8,80,424
2.48
ముస్లిం మైనార్టీలు మినహా ఓసీలు
47,21,115
13.31
ఓసీలు
56,01,539
15.79
"ఈ సర్వే భవిష్యత్‌లో మైలురాయిగా నిలుస్తుంది. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, ఉపాధి పథకాలకు ఇది దిక్సూచిగా నిలుస్తుంది. 56 శాతంపైగా ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పించాలి. కులసర్వేలో పాల్గొన్న అందరినీ రాజకీయాలకతీతంగా అభినందించాలి." - రేవంత్ రెడ్డి, సీఎం
నిర్ణయం తీసుకున్న ఏడాది లోపే సర్వే చేయించాం :జనగణన కంటే పకడ్బందీగా కులగణన సర్వే చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించారని, ఒక ఎన్యుమరేటర్ రోజుకు 10 ఇళ్ల కంటే ఎక్కువ ఇళ్లు సర్వే చేయలేదని తెలిపారు. 8 పేజీలతో ఉన్న ప్రశ్నపత్రంలో సమగ్ర వివరాలు నమోదు చేశామని పేర్కొన్నారు. 76 వేల మంది డేటాఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల పాటు డేటా క్రోడీకరించారని వివరించారు. రూ.125 కోట్లు ఖర్చు చేసి సమగ్రమైన వివరాలు సేకరించామన్నా ఆయన నిర్ణయం తీసుకున్న ఏడాదిలోపే పకడ్బందీగా సర్వే చేయించామని తెలిపారు.
ప్రజాప్రతినిధులే బహిష్కరించారు : కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సహా చాలామంది బీఆర్‌ఎస్ నేతలు సర్వేలో పాల్గొనలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతల్లో డీకే అరుణ కూడా సర్వేలో పాల్గొనలేదని తెలిపారు. భూముల వివరాలు అడగటం చూసి చాలామంది నేతలు సర్వేను బహిష్కరించారని పేర్కొన్నారు. భూముల వివరాలు అడిగితే బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. 2021 జనాభా లెక్కలను కేంద్రప్రభుత్వం ఇంకా ఎందుకు చేపట్టలేదన్న ఆయన దేశంలో 1871 నుంచి క్రమం తప్పకుండా జనాభా లెక్కలు జరుగుతున్నాయని అన్నారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు :గత ప్రభుత్వం సమగ్రసర్వే చేయించి నివేదికను ఎందుకు బయటపెట్టలేదని రేవంత్ రెడ్డి అడిగారు. సమగ్రసర్వే నివేదికను గత ప్రభుత్వం మంత్రివర్గంలో, అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3.50 కోట్లని, ఇప్పుడు కులగణన సర్వే ప్రకారం రాష్ట్ర జనాభా 3.76 కోట్లని తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన సమాచార సేకరణకు ప్రజాప్రతినిధులే సహకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై మాట్లాడిన ఆయన చట్ట ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కోర్టు ఒప్పుకోదని, కానీ తాము రాజకీయాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం సీట్లు ఇస్తామని స్పష్టం చేశారు.
"కులసర్వే సారాంశాన్నే సభలో ప్రవేశపెట్టాము. కులసర్వే మొత్తం నాలుగు భాగాలుగా ఉంది. మొదటి 3 భాగాలు సభలో ప్రవేశపెడతాం. నాలుగో విభాగంలో పౌరుల వ్యక్తిగత సమాచారం ఉంది. వ్యక్తిగత గోప్యత చట్టం కారణంగా నాలుగో భాగం ప్రవేశపెట్టలేం. రాష్ట్రంలో 3.54 కోట్ల మంది సర్వేలో పాల్గొన్నారు. ఏ, బీ, సీ, డీ, ఈ వర్గాల్లో ఉన్న బీసీల శాతం 56.33. గత ప్రభుత్వం సమగ్రసర్వేను మంత్రివర్గం ముందు ఎందుకు పెట్టలేదు. గత ప్రభుత్వం సమగ్రసర్వేను అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదు?. బీసీలకు మేలు చేసే అంశంపై ప్రతిపక్ష నేత చర్చకు ఎందుకు రాలేదు?. ప్రతిపక్షం లేకుంటే ప్రభుత్వం చేసే కృషి కూడా ప్రశ్నార్థకం కావొచ్చు." -రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి