CM Revanth Meets Union Minister Rajnath Singh :సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణ ఎంపీలతో కలిసి ఇవాళ దిల్లిలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్తో ఆయన భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాలకు రక్షణ శాఖ భూములు 2,450 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం (ఆర్‌సీఐ) ఉపయోగించుకుంటున్న విషయాన్ని ముఖ్యమంత్రి రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంతో పాటు నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ భూములు తమకు అవసరమని, ఆర్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వ భూములు వినియోగించుకుంటున్నందున రక్షణ శాఖ భూములు 2,450 ఎకరాలు తమకు అప్పగించాలని కోరారు.
వరంగల్ నగరానికి గతంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతుల గడువు ముగిసినందున అనుమతులు పునరుద్ధరించాలని లేదా తాజాగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.