CM Revanth Meeting on Skill University Establishment : దిల్లీ, హర్యానా తరహాలో రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు అధికారులు ముసాయిదాను సిద్ధం చేశారు. వర్సిటీలో సర్టిఫికేషన్ కోర్సులు, డిప్లొమా కోర్సుల వివరాలు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ స్కిల్ వర్సిటీ బిల్లు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు ప్రాథమికంగా నిర్ణయించింది. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ముసాయిదా బిల్లుపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ముసాయిదాపై చర్చించారు.
ముసాయిదా, యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శిక్షణ పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనిపై ముందుగానే పలు కంపెనీలతో చర్చించాలని సూచించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం నిధుల విషయంలో రాజీపడొద్దని స్పష్టంగా చెప్పారు. సమావేశంలోని సూచనలను పరిగణనలోకి తీసుకొని మార్పులు, చేర్పులతో అసెంబ్లీ సమావేశాల నాటికి పూర్తిస్థాయి ముసాయిదా సిద్దం చేయాలని సీఎం అధికారులకు తెలిపారు.
యుద్ధప్రాతిపదికన స్కిల్ యూనివర్సిటీ పనులు : గచ్చిబౌలిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలకు అందుబాటులో ఉన్నందున ఈ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని గత సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. స్కిల్ యూనివర్సిటీకి ఐబీఎం తరహాలో ఒక బోర్డు ఉండాలని తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులు యుద్ధప్రాతిపదికన జరగాలని గత సమావేశంలో సీఎం ఆదేశించారు.