CM Revanth Launched Four Welfare Schemes :తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నాలుగు పథకాలను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన రూ.11.80 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. 734 మందికి రైతు భరోసా చెక్కులను రేవంత్ పంపిణీ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
ఇవాళ రైతుభరోసా డబ్బులు జమ కావు : గణతంత్ర దినోత్సవం రోజున 4 సంక్షేమ పథకాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. సాగు ఖర్చులు పెరిగాయని రైతు భరోసా నిధులు పెంచామన్న రేవంత్ రెడ్డి ఏడాదికి ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు. ఇవాళ ఆదివారం కావడంతో రైతు భరోసా డబ్బులు జమకావన్న ఆయన, అర్ధరాత్రి 12 దాటగానే రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని వివరించారు. భూమి లేని వారిని కూడా ఆదుకోవాలని గతంలో కూలీలు అడిగారని, వారి కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను తీసుకువచ్చామని రేవంత్ వివరించారు. కూలీ పని చేసే పేదలకు ఆ పథకం కింద రూ.12 వేలు ఇస్తున్నామని తెలిపారు.
దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్క సంతకంతో దేశమంతటా రుణమాఫీ చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో ఒకే విడతలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. అలా చేసిన రాష్ట్రం మరొకటి లేదని వివరించారు. 25.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.21 వేల కోట్లు జమ చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు.
భూమికి, విత్తుకు ఉన్న అనుబంధం రైతుకు కాంగ్రెస్‌కు మధ్య : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎన్నో హామీలు నెరవేర్చామని రేవంత్ రెడ్డి వివరించారు. భూమికి విత్తనానికి ఉన్న అనుబంధం రైతుకు కాంగ్రెస్‌కు మధ్య ఉందని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. రైతులకు ఉచిత కరెంట్‌ను మొదట అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. దేశమంతటా రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ సర్కారేనన్నారు.