CM Revanth Reddy On Telangana Development :ఒకే దేశం - ఒకే ఎన్నిక నినాదం వెనక ఒకే వ్యక్తి - ఓకే పార్టీ అనే ప్రధాని మోదీ రహస్య ఎజెండా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేరళలో మాతృభూమి అనే దినపత్రిక తిరువనంతపురంలో నిర్వహించిన 'మాతృభూమి ఇంటర్‌నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్' సదస్సుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏడాదిలో సుపరిపాలన ఎంత మార్పు తెస్తుందో చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం నిదర్శనమని తెలిపారు. ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, లండన్, దుబాయ్‌లతో పోటీ పడేలా హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టినట్లు వివరించారు. విద్యా, నైపుణ్యాలే తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యమన్న ముఖ్యమంత్రి, తగ్గట్టుగానే స్కిల్ యూనివర్సిటీ దిశగా అడుగులేస్తున్నామని తెలిపారు.
ప్రపంచానికే రోల్ మోడల్‌గా తెలంగాణ : తెలంగాణను ప్రపంచంలో మోడల్‌గా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో ఉన్నానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు కాపాడుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడం వల్లే తెలంగాణ ప్రజలు ఆమెను ప్రేమిస్తున్నారన్నారు. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదని రేవంత్ మండిపడ్డారు. కనీసం రూ.25 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురాలేకపోయారన్నారు.
"రాజకీయ పార్టీలది పరిమిత పాత్ర. ప్రజలు కలిసి రావాలి. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అని దక్షిణ భారతదేశ ప్రజలు ఆలోచించాలి. నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు ప్రతి దాన్ని ఆక్రమించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతీది చేతివేళ్లతో నియంత్రించాలని అనుకుంటున్నారు. కాబట్టి మనం స్పందించాల్సిన సమయం ఇది. మీరు ఏ రాజకీయ పార్టీని గానీ, రాజకీయ నాయకుడిని గానీ అడిగితే, వారికి సొంత ఎజెండా ఉంటుంది. వారు ఈ అంశం ద్వారా కొన్నింటిని పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ప్రజలు కలిసి రావాలి, మనం ఎవరితోనైనా పోరాడాలి. అవసరమైతే దీనిపై చొరవ తీసుకోవడానికి నేను సిద్ధం"- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి