Govt Focus To Invite Foreign Universities :ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు, ఫార్మా, ఐటీ కంపెనీలకు హబ్‌గా మారిన భాగ్యనగరానికి ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక్క విదేశీ యూనివర్సిటీనైనా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయించాలని, తద్వారా ఇక్కడి విద్యార్థులకు అత్యుత్తమ అవకాశాలు కల్పించడంతోపాటు నగర బ్రాండ్‌ను మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల విదేశీ పర్యటనలో అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ, యూకేకు చెందిన ఆక్స్‌ఫర్డ్ యాజమాన్యాలతో సమావేశమై హైదరాబాద్‌లో క్యాంపస్‌లను నెలకొల్పాలని ఆహ్వానించారు. రాష్ట్ర విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలని, అందుకోసం టాప్ వర్సిటీల యాజమాన్యాలతో మాట్లాడి క్యాంపస్‌లు ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే.
గత నవంబరులోనే కేంద్రం అనుమతి :ఇండియా నుంచి ఏటా 12 లక్షల మంది ఉన్నత విద్య కోసం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, జర్మనీ తదితర దేశాలకు వెళుతున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఉంటున్నారు. ఈ క్రమంలో విదేశీ యూనివర్సిటీల ప్రాంగణాలను దేశంలో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 2023 నవంబరులోనే అనుమతిచ్చింది. ప్రపంచ ర్యాంకింగ్‌లో టాప్ 500 వర్సిటీలు యూజీసీకి దరఖాస్తు చేసుకోవచ్చని అవకాశం కల్పించింది. దీంతో దాదాపు 10కిపైగా విశ్వవిద్యాలయాలు దరఖాస్తు చేసుకున్నట్లు యూజీసీ వర్గాల సమాచారం.
Foreign Universities In India :ఆస్ట్రేలియాకు చెందిన డైకిన్ వర్సిటీ అహ్మదాబాద్‌లోని గిఫ్ట్ సిటీలో క్యాంపస్ ఏర్పాటుకు యూజీసీ (విశ్వవిద్యాలయ నిధుల సంఘం) నుంచి అనుమతి పొందింది. అక్కడ ప్రస్తుత విద్యా సంవత్సరం(2024-25)లోనే తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంగణంలో సైబర్ సెక్యూరిటీ విభాగంలో పీజీ కోర్సుకు 3,500 దరఖాస్తులు రావడం విశేషం.