తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏటా డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం - అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి - TELANGANA THALLI STATUE DETAILS

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చారిత్రక ఘట్టమన్న సీఎం రేవంత్ - ప్రతీ ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు

CM Revanth Reddy Reveals Telangana thalli statue Details
CM Revanth Reddy Reveals Telangana thalli statue Details (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 9, 2024, 3:25 PM IST

Updated : Dec 9, 2024, 7:37 PM IST

CM Revanth Reddy Reveals Telangana thalli statue Details :తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపేలా, ఉద్యమ స్ఫూర్తిని భావోద్వేగాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లిని రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చారిత్రక ఘట్టమని ప్రతి ఏటా డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇప్పటి వరకు ప్రాచుర్యంలో ఉన్న విగ్రహానికి అధికారిక గుర్తింపు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంపై శాసనసభలో ప్రకటన చేసిన సీఎం విగ్రహం ప్రత్యేకతలను వివరించారు.

తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపేవిధంగా :అసెంబ్లీ వేదికగా తెలంగాణ తల్లి విగ్రహ ప్రత్యేకతలను సీఎం రేవంత్ రెడ్డి సభకు వివరించారు. స్వరాష్ట్ర సాధన సుదీర్ఘ పోరాటంలో సకల జనుల్లో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లిని అధికారికంగా గౌరవించుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ భావోద్వేగాన్ని ప్రతిబింబించేలా ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపొందించిందని చెప్పారు. ప్రశాంత వదనంతో నిండైన రూపంతో చాకలి ఐలమ్మ, సారలమ్మ పోరాట స్ఫూర్తి కనిపించేలా హుందాతో కనిపించేలా విగ్రహాన్ని రూపొందించినట్టు చెప్పారు. తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపేవిధంగా చేతిలో తెలంగాణ పంటలతో కనిపిస్తుందన్నారు. తెలంగాణ తల్లి నిల్చున్న పీఠం చరిత్రకు దర్పణంగా నిలుస్తుందని సీఎం వివరించారు. విగ్రహంలో వాడిన ఒక్కో రంగు ప్రత్యేకతను చెప్పిన సీఎం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు.

సంక్షిప్త నామం టీజీకి అధికారిక గుర్తింపు :తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో విగ్రహ రూపకల్పనతో పాటు తెలంగాణ సంక్షిప్త పేరు టీజీకి అధికారిక గుర్తింపు ఇచ్చామని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసిన జయ జయహే తెలంగాణను రాష్ట్ర అధికార గీతంగా ప్రకటించామని సీఎం చెప్పారు. తెలంగాణ ఏర్పాటైన పదేళ్ల తర్వాత ప్రజాప్రభుత్వంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసుకోవడం సంతోషంగా ఉందని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సగర్వంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రతిపక్షాలను ఆహ్వానిస్తే వారు రాకపోవడం సహా అడ్డుకునే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తామన్నారు.

విగ్రహ మార్పుపై విపక్షాల భిన్న స్వరాలు :తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై విపక్ష పార్టీలు భిన్న స్వరాలు వినిపించాయి. అన్ని పక్షాలతో చర్చించాల్సిందన్నాయి. తెలంగాణ తల్లి బతుకమ్మ ఎత్తుకున్నట్లు ఉంటే బాగుండేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్ అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్‌ 17ను సైతం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ నేత కూనంనేని సభావేదికగా కోరారు. చర్చ అనంతరం శాసనసభ వచ్చే సోమవారానికి వాయిదా పడింది.

'తెలంగాణ తల్లి అంటే భావన కాదు - 4 కోట్ల బిడ్డల భావోద్వేగం'

లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ - కీలక ప్రకటన చేయనున్న సీఎం

Last Updated : Dec 9, 2024, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details