CM Revanth Reddy Launches the Book 'Unika' : మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తానని సభలో ప్రసంగిస్తూ చెప్పారు. విద్యాసాగర్‌రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
‘‘విపక్ష నేతలైనా అవసరం ఉన్నచోట వారి అనుభవాన్ని వినియోగించుకుంటాం. తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. మెట్రో, రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణాల విషయాలపై కేంద్రం సహకరించాలని ప్రధానమంత్రి మోదీని కోరాను. కేంద్రం సహకరిస్తేనే రాష్ట్రాల అభివృద్ధి త్వరగా పరిపూర్ణమవుతుంది. హైదరాబాద్ మెట్రోకు అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఒకప్పుడు రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో, నేడు 9వ స్థానానికి పడిపోవడం బాధాకరం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కొన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ఏకతాటిగా కలిసి పోరాడుతున్నాయి. మనం ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడాలి’’ -సీఎం రేవంత్ రెడ్డి
రేవంత్ ‘హైడ్రా’ ఆలోచన అభినందనీయం :నాయకులు ఎవరు ఏ పార్టీలో ఉన్నా, జాతీయ భావన ఉంటుందని మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా భారతీయతను వదులుకోకూడదని డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ బౌద్ధమతంలో చేరారని చెప్పారు. తన ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విద్యాసాగర్‌రావు ప్రసంగించారు. శ్రీపాద రావు అప్పట్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేశారని, అందుకే ఆ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని బీజేపీ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. రథయాత్ర సమయంలో అశ్వమేధ యాగం చేస్తున్నారని ఆడ్వాణీని సీనియర్ ఎన్టీఆర్ మెచ్చుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్ తన సినిమాల్లో బీసీ వాదాన్ని చక్కగా తెరకెక్కించారన్నారు.