CM Revanth Orders to Expand GHMC :రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి మణిహారమైన ఔటర్ రింగ్‌రోడ్డు వరకు జీహెచ్‌ఎంసీని విస్తరించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలోని నగరపాలికలు, పురపాలక సంఘాలను(Municipalities) కలిపి మహా గ్రేటర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రణాళికను వచ్చే జూన్ నాటికి పూర్తి చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటున్నట్లు ఓ సీనియర్ ఆఫీసర్ చెప్పినట్లు సమాచారం.
మరో అరవై డివిజన్లు పెరిగే అవకాశం :పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా సమయం ఉండటంతో ప్రైమరీ నివేదికను ఎన్నికల కోడ్ తరువాత సీఎం ముందుంచాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 74 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. జనాభా కోటి సంఖ్య వరకూ ఉంది. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలను బల్దియాలో విలీనం చేస్తే జనాభా మరో 60 లక్షల వరకు పెరుగుతుందని అంచనా లెక్కలు వేశారు.
ఇకపై జీహెచ్‌ఎంసీ కాదు - హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్!
దీంతో అదనంగా మరో 50 నుంచి 60 డివిజన్ల వరకు పెరుగుతాయని అధికారులు అంటున్నారు. అప్పుడు డివిజన్ల సంఖ్య 210 వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రణాళికనే సీఎం రేవంత్ ముందు పెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. మహా గ్రేటర్ పెద్దగా ఉంటుందని ముఖ్యమంత్రి(CM Revanth Reddy) భావిస్తే దీన్ని రెండుగా చేయమని ఆదేశించినా, అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తామని ఓ సీనియర్ అధికారి ఈటీవీ భారత్‌కు తెలిపారు.