CM Revanth On SAMAGRA SHIKSHA Contract Employees :సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. సమగ్ర శిక్ష అభియాన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవకాశం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే కోర్టుల్లో సమస్యలు వస్తాయని వివరించారు. అవకాశం లేకపోయినా రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
చర్చల ద్వారానే పరిష్కారమవుతాయి :సమస్యల పరిష్కారానికి ధర్నాలే చేయాల్సిన అవసరం లేదన్న రేవంత్ రెడ్డి చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని తెలిపారు. రాజకీయాల కోసం కొందరు నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. రాజకీయ నేతల ఉచ్చులో పడితే చివరికి నష్టపోయేది ఉద్యోగులేనని ఆయన తెలిపారు. ఒప్పంద ఉద్యోగులను, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఉన్నప్పటికీ చేయలేని పరిస్థితి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. సర్వశిక్షా అభియాన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదని వెల్లడించారు.