Telangana Govt Focus on Kaleshwaram Barrages Repairs :కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతుల విషయమై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. మేడిగడ్డ ఆనకట్ట ఏడో బ్లాక్‌లోని పియర్స్ కొన్ని దెబ్బతినడంతో పాటు అన్నారం, సుందిళ్లలో సీపేజీ సమస్యలు వచ్చిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీతో అధ్యయనం చేయిస్తోంది.
CM Revanth High Level meeting on Kaleshwaram Today : చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు బాధ్యులతో విస్తృతంగా చర్చించింది. మూడు ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ పీసీఘోష్ ఆధ్వర్యంలో న్యాయవిచారణ జరుగుతోంది. జస్టిస్ ఘోష్ ఆదేశాల మేరకు ఎన్‌డీఎస్‌ఏ కమిటీ నుంచి మధ్యంతర నివేదిక తెప్పించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో బ్యారేజీలకు మరింతగా నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ మధ్యంతర నివేదికలో పలు సిఫార్సులు చేసింది.
వర్షాలు వచ్చేలోపు మూడు ఆనకట్టలకు సంబంధించిన గేట్లను పూర్తిగా తెరిచి ఉంచాలని, సీపేజీ సమస్యలను అరికట్టాలని తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లోని 20, 21వ గేట్లను కటింగ్ ద్వారా పూర్తిగా తొలగించాలని, ఆ బ్లాక్‌లోని మిగతా గేట్లు తెరిచేందుకు రాకపోతే వాటిని సైతం పూర్తిగా తొలగించాలని సూచించింది. ఇదే సమయంలో పగుళ్లు వచ్చిన పియర్స్ మరింత దెబ్బతినకుండా చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ తెలిపింది. ఇవన్నీ చేసినప్పటికీ తదుపరి నష్టం జరగబోదన్న హమీ ఇవ్వలేమని పేర్కొంది.
వర్షాకాలం లోపు తగిన రక్షణ చర్యలు : వర్షాకాలం లోపు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని జస్టిస్ పీసీ ఘోష్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సూచించారు. మరమ్మతులపై నీటిపారుదల శాఖ ఇప్పటికే పలు దఫాలు సమావేశాలు నిర్వహించింది. ఎన్‌డీఎస్‌ఏ కమిటీ సిఫార్సుల మేరకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. మేడిగడ్డ ఆనకట్టను నిర్మించిన ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధులతోనూ నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీలు అనిల్, నాగేందర్‌రావు భేటీ అయ్యారు. వర్షాలు ప్రారంభమయ్యే లోపు చేయాల్సిన పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
Medigadda Barrage Damage Updates :మేడిగడ్డబ్యారేజీ నిర్మాణం పూర్తయినందున మరమ్మతులకు అదనపు వ్యయం అవుతుందని, ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు అంటున్నారు. పని పూర్తయినట్లు పొరపాటుగా ధ్రువీకరణ పత్రం ఇచ్చినట్లు క్షేత్రస్థాయి ఇంజినీర్ ప్రభుత్వానికి తెలిపారు. ఒప్పందం ప్రకారం పనులు చేయాల్సిందేనని నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు ఎల్‌అండ్‌టీ సంస్థకు స్పష్టం చేశారు. ఒప్పందంలో లేని పనులు చేస్తే, ప్రభుత్వం నుంచి అదనంగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు వాదిస్తున్నారు.