CM Revanth Felicitated 10th Class Toppers with Talent Awards : ఏక ఉపాధ్యాయ పాఠశాలలను మూసివేయవద్దని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ప్రతీ గ్రామం, ప్రతీ తండాకు విద్యను అందించేలా ప్రభుత్వం ముందుకెళ్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మట్టిలో మాణిక్యాలుగా రాణించి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారని సర్కార్ స్కూల్లో చదువుతోన్న విద్యార్థులను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. రవీంద్రభారతిలో నిర్వహించిన పదో తరగతి టాపర్ల ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మహిళా సంఘాలకు మధ్యాహ్న భోజన పథకం బాధ్యత :శిథిలావస్థకు చేరిన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించాం అన్నారు. విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 90శాతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పాఠాశాలల్లో చదివినవారే అని, ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే చంద్రబాబునాయుడు, తనతో సహా ప్రముఖ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారే అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
"ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం, దాని ద్వారా త్వరలో 11వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తున్నాం. రూ.2వేల కోట్లు ఖర్చు పెట్టి శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ బడులను బాగు చేసేందుకు ఖర్చు చేస్తున్నాం. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ద్వారా తల్లిదండ్రుల్లో ప్రభుత్వ బడులపై అవగాహన కల్పించాలి. పిల్లలను సర్కార్ బడుల్లో చేర్పించకపోతే, పాఠశాల మూతబడుతుందని తల్లిదండ్రులకు చెప్పాలి."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి