CM Jagan Negligence on Irrigation Projects: ఏ ప్రభుత్వమైనా రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలనుకుంటుంది. ప్రాజెక్టుల నిర్మాణాన్ని బాధ్యతగా భావిస్తుంది. ఎంత అవకాశం ఉంటే అంతగా నిధులను సమీకరించి అభివృద్ధిబాటలో పరుగులు తీయాలనుకుంటుంది. రివర్స్ పాలన సాగించే జగన్ సర్కారు ఇందుకు విరుద్ధంగా వెళుతోంది. 2016-18 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసి ప్రాజెక్టు నివేదికలు పంపి రాష్ట్రంలో చిన్ననీటి వనరులను పునరుద్ధరించి, లక్షల ఎకరాలకు ప్రయోజనం కల్పించేందుకు ప్రపంచబ్యాంకు, జైకా సంస్థల రుణం సమీకరించి అడుగులు ముందుకు వేస్తే ఇప్పుడు జగన్ సర్కార్ కాదు పొమ్మంటోంది.
ఏడేళ్ల ప్రాజెక్టు కాలం పూర్తవుతోంది. ఇప్పటికే ఆ నిధులు వెచ్చించి పనులు పూర్తి చేయాలి. వైసీపీ సర్కార్ రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోగా ఇప్పుడు ఆ రెండు ప్రాజెక్టుల్లోనూ భారీ కోత పెట్టింది. ప్రపంచ బ్యాంకు, జైకా సాయంతో 3 వేల600 కోట్లతో నాడు ప్రాజెక్టులు చేపట్టగా, ఇప్పుడు అందులో 18 వందల 30 కోట్ల కోత పెట్టేస్తూ తాజాగా జల వనరులశాఖ ఉన్నతాధికారులు పాలనా ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ప్రాజెక్టుల స్వరూపమే మారిపోయింది. అభివృద్ధి కోసం రుణం ఇస్తామన్నా వద్దంటున్న జగన్ ప్రభుత్వ తీరుపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
'రాష్ట్రమంతా కరవు తాండవం' - నదుల అనుసంధానంపై ఊసెత్తని వైఎస్సార్సీపీ ప్రభుత్వం
తెలుగుదేశం హయాంలో జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ సాయంతో రాష్ట్రంలో నీటి పారుదల ఆధారంగా జీవనాభివృద్ధి ప్రాజెక్టు పేరుతో ఒక పథకాన్ని చేపట్టారు. ఇందులో జైకా సాయం 17 వందల కోట్లు కాగా, రాష్ట్ర వాటా 300 కోట్లు. ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో 445 చిన్న నీటి చెరువులను పునరుద్ధరించడంతో పాటు ఒక భారీ, 19 మధ్య తరహా ప్రాజెక్టులను ఆధునికీకరించాలని ప్రతిపాదించారు. కేంద్ర జల సంఘం ప్రమాణాల ప్రకారం డీపీఆర్‌లు తయారయ్యాయి. వాటిని రాష్ట్ర సాంకేతిక కమిటీ ముందుంచి, ఆమోదం పొంది, తర్వాత కేంద్ర అనుమతితో సాయం చేసేందుకు జైకా అంగీకరించింది.
2017 డిసెంబరులో ఈ ప్రాజెక్టుకు జలవనరులశాఖ 2 వేల కోట్లతో పాలనామోదం ఇచ్చింది. జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టు పడకేసింది. జైకా ఇచ్చిన సొమ్ములనూ సరిగా ఖర్చుపెట్టకపోవడంతో ఆ సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాష్ట్ర వాటా ఇచ్చేందుకు ముందుకురాని సర్కార్, ఇప్పుడు ఆ ప్రాజెక్టు చేపట్టలేమంటూ చేతులెత్తేసింది. ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నీటిపారుదల ప్రాజెక్టుల ఆధునీకీకరణ, 445 చిన్ననీటి వనరుల చెరువుల పునరుద్ధరణకు నాడు 942 కోట్ల 43 లక్షలు కేటాయించారు.