CM Jagan Memantha Siddham Meeting :'మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. హీరో గుణగణాలు, చేసే మంచి కారణంగా మనవాడని అనుకుంటాం. మోసం, కుట్రలను చేసేవాడిని విలన్ అంటాం' అని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో మొదలైన జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర 22వ రోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బుధవారం ముగిసింది. ముగింపు సభలోనూ సంక్షేమ పథకాలపై ఊకదంపుడుకే ప్రాధాన్యమిచ్చారు. తనకు ఓటేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయంటూ బెదిరించే ధోరణిలో జగన్ ప్రసంగం సాగింది.
రాజధాని లేని రాష్ట్రమని నవ్వుకుంటున్నారు :'మోసాన్ని మోసంతో జయించాలన్న రాజనీతిని మీ బిడ్డ అమలు చేయడు. మోసాన్ని నిజాయతీతోనూ జయించవచ్చని నిరూపించడానికి సిద్ధం' అంటూ సీఎం జగన్ టెక్కలిలో కొత్త రాగం అందుకున్నారు. 'మీ నాయకుడు ఎవరని అడిగితే తలెత్తుకోలేని నాయకుడు కావాలా? కాలరెగరేసుకుని చెప్పుకొనే జగన్‌లాంటి నాయకుడు కావాలా?' అంటూ ప్రశ్నించారు. రాష్ట్రం పేరు చెబితేనే రాజధాని లేని రాష్ట్రమని అంతా నవ్వుకుంటున్నారు. రహదారులపై గుంతలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఉద్యోగాల్లేక యువత పక్క రాష్ట్రాలకు వలస వెళుతోంది. ఇవన్నీ చూసి ఎలా తలెత్తుకుంటాం జగన్ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సిద్ధం యాత్రతో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న జగన్ - ఎండ తీవ్రతతో బస్సుల కింద! - Jagan Bus Yatra
ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదాపై మీరేం చేశారు? :2014లో చంద్రబాబు కూటమి మ్యానిఫెస్టోను విస్మరించింది, ప్రత్యేక హోదా తేలేదని జగన్ అన్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని జగన్ 2019 ఎన్నికల ముందు చెప్పారు. మరి అధికారం ఇచ్చిన ఐదేళ్లు ఏం చేశారో చెబితే అందరూ తెలుసుకునే వాళ్లు కదా? అన్న విమర్శలు వచ్చాయి. అధికారం దక్కిన మొదటి రోజు నుంచి ప్రతి రంగాన్ని ఎలా సిద్ధం చేశానో గమనించాలని జగన్ ప్రజలను కోరారు. గ్రామస్థాయిలో వ్యవసాయ రంగాన్ని సిద్ధం చేశానన్న జగన్, కొత్తగా ఎకరానికి నీరిచ్చిన దాఖలాల్లేవు. రైతుకు వెన్నెముకలాంటి సాగునీటి ప్రాజెక్టుల కోసం ఎంత వెచ్చించారు? ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో సభలో చెప్పలేదు. శ్రీకాకుళంలో వంశధార కరకట్ట నిర్మాణం, కాలువల ఆధునికీకరణ, ఆఫ్‌షోర్ రిజర్వాయర్, రంగసాగరం ఎత్తిపోతల పూర్తి చేస్తామంటూ రెండు సంవత్సరాల కిందట ఆయనిచ్చిన హామీలకే దిక్కులేదన్న విమర్శలు వచ్చాయి.
స్కీంలు ఏమోకానీ, స్కాంలు ఎవరూ చేయలేరు :ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఇంటింటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వ వ్యవస్థ 'సిద్ధం' అని జగన్ పేర్కొన్నారు. జగన్ బృందానికి తెలిసిన డోర్ డెలివరీ అంటే దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన చరిత్ర అని మరిచినట్లున్నారని టెక్కలి సభ వద్దనే కొందరు యువత విమర్శనాస్త్రాలు సంధించారు. ఇదే విధంగా ఉత్తరాంధ్రపై ప్రధానంగా 'నా విశాఖ' అంటూ ప్రేమ గుప్పించారు. నమ్మి ఓట్లు వేసిన జనానికి అయిదేళ్లలో విధ్వంసం చూపించారు. జగన్ చేయలేని ఏ స్కీంను చంద్రబాబు కాదు కదా ఆయన జేజమ్మ కూడా చేయలేరని జగన్ వ్యాఖ్యానించారు. ఆయన స్కీంలు ఏమోకానీ, స్కాంలు ఎవరూ చేయలేరని ప్రతిపక్షాలు సామాజిక మాధ్యమాల్లో కౌంటర్ ఇచ్చాయి.