ఏంటీ వీళ్లు మంచోళ్లా? - ఒకసారి ఈ అరాచకాలు చూద్దామా జగన్? CM Jagan Lies About YSRCP Candidates: తమ్ముడు అంటూ అనిల్‌కుమార్ యాదవ్‌ని జగన్ పిలుస్తున్నారు. కానీ నెల్లూరులో రౌడీయిజానికి చిరునామా ఎవరో కనుక్కుని ఓటేయండని టీడీపీ అంటోంది. ఆయన రౌడీయిజానికి తలవంచకపోతే సొంత పార్టీ వారినైనా వెంటాడి వేధిస్తారని విమర్శిస్తోంది. మీ తమ్ముడు అనిల్ అక్కడి నుంచే వచ్చారుగా? కాస్త కనుక్కుని చెబుతారా జగన్. నోరు తెరిస్తే, వినలేనంత జుగుప్సాకర భాషలో మాట్లాడేవాళ్లూ ఆయనకు బాగా తెలుసంట? ఆ ఉత్తముడెవరో కాస్త తెలుసుకుని నరసరావుపేట లోక్‌సభ ప్రజలకు వివరించండని అంటోంది.
గురజాల నుంచి పోటీ చేస్తున్న కాసు మహేశ్‌రెడ్డి తనకు తమ్ముడు అంటూ జగన్ పరిచయం చేశారు. ఈ నియోజకవర్గంలో గత అయిదేళ్లలో తెలుగుదేశం నాయకులపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. మాచవరం మండలంలో ముస్లింలను ఊరి నుంచి తరిమేశారు. అంబాపురంలో విక్రమ్, దాచేపల్లి మండలంలో అంకులును హతమార్చారు. వీటన్నిటికి కారణమెవరు జగన్? నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ ద్వారా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఇవన్నీ అయిదేళ్లు ప్రాతినిధ్యం వహించిన మహేశ్‌రెడ్డికి తెలుసో లేదో కనుక్కున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వందల కోట్ల ఆస్తులు - వైసీపీ అభ్యర్థులు పేదవాళ్లే - జనం చెవిలో జగన్ పువ్వులు - Jagan Lies About Candidates
మాచర్ల నియోజకవర్గంలో ఎన్నో అరాచకాలు: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జగన్ పొగడ్తలకు, వాస్తవానికి అసలు పొంతన లేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మాచర్ల నియోజకవర్గంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలను అక్కడ అడుగు పెట్టనీయడంలేదు. పట్టపగలే రాజకీయ ప్రత్యర్థుల గొంతులు కోశారు. వెల్దుర్తి మండలంలో తోట చంద్రయ్య, దుర్గి మండలంలో జల్లయ్య అనే వ్యక్తిని అమానుషంగా హత్య చేశారు. ప్రతిపక్ష నేతలపై దాడులకు తెగబడుతున్నారు. ఎస్సీలను ఊరిలో నిలవనీయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భయోత్పాతం సృష్టించి, ఇళ్లపై దాడులు చేయించి, ఏకగ్రీవాలు చేయించారు. వేలమందిని ఊళ్ల నుంచి తరిమేశారు.
నిర్మాణంలోని అపార్ట్‌మెంట్ల నుంచి రూ. 30 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. తెలంగాణ నుంచి మద్యం తెచ్చి అక్రమంగా వ్యాపారం చేస్తూ పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. భూముల కబ్జాకు తెగబడ్డారు. ప్రత్యర్థి పార్టీ నేతల వాహనాలతోపాటు టీడీపీ కార్యాలయానికీ నిప్పు పెట్టారు. ఆ పార్టీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులు చేశారు. పల్నాడును విధ్వంసాలకు చిరునామాగా, చంబల్‌లోయగా మార్చారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు జగన్! మీ స్నేహితుడికి తెలుసా, లేదా? అంటూ ప్రజల నిలదీస్తున్నారు.
వైసీపీ అభ్యర్థులపై అసంతృప్తి - చల్లారని కలహాల కుంపట్లు - Revolt Against YCP Candidates
ఇవి కనిపిస్తున్నాయా: బ్రహ్మనాయుడికి జగన్ ఇచ్చే కితాబులకు తక్కువ ఏం లేదు కానీ ఆయన అయిదేళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన వినుకొండ నియోజకవర్గంలో ఎన్నో అక్రమాలు జరిగాయి. 120 ఎకరాల భూమిని అధిక ధరకు జగనన్న కాలనీలకు కొనుగోలు చేశారు. టీడీపీ నేతలపై రౌడీషీట్లు తెరిపించి, రైతులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. చుక్కల భూముల్ని అనుచరులతో కొనుగోలు చేయించి ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సౌమ్యుడు, కల్మషం లేని వారికి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
గోపిరెడ్డి సౌమ్యుడని జగన్ అంటున్నారు కానీ నరసరావుపేట పురపాలక సంఘ చెక్‌బుక్‌ను ముఖ్యనాయకుడు ఒకరు ఇంట్లో పెట్టుకుని పట్టణాన్ని కొల్లగొడుతున్నారు. మెడికల్ మాఫియా, రియల్ ఎస్టేట్, చుక్కల భూముల్లో భారీ ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారు. ఇవన్నీ మంచివాడని చెబుతున్న శ్రీనివాసరెడ్డికి తెలుసో, లేదో జగన్ చెప్పాలి మరి.
అరాచకాలే అర్హతగా వైసీపీ అభ్యర్థుల జాబితా - భూకబ్జాదారులు, అక్రమార్కులకే అవకాశం - YSRCP Candidates List
పెదకూరపాడు నుంచి పోటీ చేస్తున్న నంబూరు శంకర్రావును జగన్ ఆకాశానికెత్తేశారు. కానీ అయిదేళ్లుగా పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో పెద్దఎత్తున ఇసుక దోపిడీ జరుగుతోంది. కృష్ణా నదీ గర్భంలోకి రోడ్లేసి మరీ ఇసుకను తవ్వేస్తూ రూ. వందల కోట్లు దోచుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఇసుక దోపిడీలో కీలక పాత్రధారి, వైసీపీ ముఖ్యనేతకు రోజువారీ రూ.కోట్లలో వాటాలు పంపేది ఆయనేనంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఇసుక దోపిడీని వెలుగులోకి తెచ్చిన నాయకులపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. ఇవన్నీ జరిగేది మంచి నాయకుడని మీరు చెప్పే శంకర్రావు ప్రాతినిధ్యం వహించే పెదకూరపాడు పరిధిలోనే దీనికి బాధ్యులెవరు ముఖ్యమంత్రే చెబితే బాగుంటుందని ఆ నియోజకవర్గ ప్రజలంటున్నారు.
చిలకలూరిపేట నుంచి పోటీ చేసే కావటి మనోహర్‌నాయుడిపై జగన్ ఎంతో ప్రేమ చూపించారు. కానీ గుంటూరులో ఐప్యాక్ సిబ్బందిని పక్కన కూర్చోబెట్టుకుని కౌన్సిల్ మీటింగ్‌లు నిర్వహించారని జనసేన పార్టీ ఆందోళనకు పిలుపు ఇస్తే, వారిని తరిమేందుకు అరండల్‌పేటలో లాఠీ పట్టుకుని దాడి చేశారని ప్రజలు గుర్తు చేస్తున్నారు. గుంటూరు నగరంలో సోదరులకు కాంట్రాక్టులు కట్టబెట్టి దోచుకున్నారని ప్రజలు గుర్తుచేస్తున్నారు. ఇవన్నీ ఎవరు చేసిన పనులో కాస్త కనుక్కుని జగన్ చెప్పాలని చిలకలూరిపేట ప్రజలు అడుగుతున్నారు.
అరాచకాలు, అక్రమాలే అర్హతలుగా వైసీపీ అభ్యర్థుల ఎంపిక- రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఇలాంటి వారే
ఈ ఘనకార్యాల గురించి కాస్త చెబుతారా జగన్:అంబటి రాంబాబుపై ఎనలేని ప్రేమ కురిపించిన సీఎం జగన్‌ను సత్తెనపల్లి నియోజకవర్గంలో మైనింగ్ అక్రమాల లోతెంతో వైసీపీ నేతలను అడిగి తెలుసుకోమని ప్రజలు సూచిస్తున్నారు. సంక్రాంతి సంబరాలకు టికెట్లు అమ్ముకునే నాయకులెవరో మహిళతో గంట, అరగంట అంటూ అసభ్యంగా మాట్లాడుతున్న వీడియో ఎందుకొచ్చిందో కూడా కాస్త ఆరా తీయమని చెబుతున్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒంటరి మహిళకు వచ్చిన డబ్బు నుంచి సైతం లంచం అడిగి, వాటా ఇవ్వనందుకు పంపిణీ నిలిపేశారు. దీనికి బాధ్యులెవరో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కొండమోడులో పంచాయతీ హద్దులు మార్చి అక్రమ మైనింగ్ చేస్తున్నారని సొంత పార్టీ వారే హైకోర్టును ఆశ్రయించారు. రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో అల్లుణ్ని ముందు పెట్టి కొండలు, ఖనిజాల్ని కొల్లగొడుతూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. ఇవన్నీ ఎవరి ఘనకార్యాలో కాస్త విచారించి చెబుతారా అని జగన్‌ను ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు - సమస్యలతో హారతి ఇస్తున్న ఓటర్లు - protest to ysrcp mla Candidates