CM Jagan Inaugurated Second Tunnel of Veligonda Project:ప్రకాశం జిల్లాలో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ రెండో సొరంగాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. 30 మండలాలకు సాగు, తాగునీటిని అందించడంతోపాటు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు కూడా ఎంతో కీలకమైన ప్రాజెక్టును గత ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం విమర్శించారు. తన తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును ఆయన కొడుకుగా తాను పూర్తి చేసి ప్రారంభించడం దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న మన స్వప్నాన్ని మన కళ్ల ఎదుటే పూర్తయిందని జగన్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రకాశం, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను, వారి దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందిస్తామని తెలిపారు.
విశాఖలోనే ప్రమాణస్వీకారం- అవకాశమిస్తే మరో పదేళ్లు ఊడ్చేయడానికి సిద్ధం: చెప్పకనే చెప్పిన సీఎం
ఈ పూల వెంకటసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్న, దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు సొరంగాలను పూర్తి చేసి జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అన్నది ఇంతకన్నా నిదర్శనం ఏముందని జగన్ కొనియాడారు. దాదాపు 3 వేల క్యూసెక్కులతో మొదటి టన్నెల్ పూర్తి చేశామని ఇప్పుడు 8,500 క్యూసెక్కుల కేరీయింగ్ కెపాసిటీతో రెండో టన్నెల్ పూర్తయిందని అన్నారు. శ్రీశైలంలో 840 అడుగులు దాటిన వెంటనే రోజుకో టీఎంసీని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు నీరు తీసుకొస్తామని తెలిపారు.