CM Jagan Cheated Horticulture Farmers :ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 68 వేల హెక్టార్లలో రైతులు ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అరటి, జామ, బొప్పాయి, కాకర, బీర, సొర, దొండ, చిక్కుడు, టమాటా పంటలను సాగు చేస్తున్నారు. అధునాతన పద్ధతుల్లో ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందించాల్సిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా ఆ ఊసే మరిచిందని అన్నదాతలు అంటున్నారు.
వెంటాడుతున్న నీటి కష్టాలు :నారాకోడూరు, సుద్దాపల్లి, గొడవర్రు, అనంతవరప్పాడు సహా అనేక గ్రామాల్లో ఉద్యానవన పంటలను అధికంగా సాగు చేస్తుంటారు. పందిరి, పెట్టుబడితో కలిపి ఎకరానికి మూడు లక్షల వరకూ ఖర్చు చేశారు. పంట చేతికి వచ్చే సమయానికి డిసెంబర్లో వచ్చిన తుపాను ఉద్యానవన రైతుల్ని కోలుకోలేని దెబ్బ తీసింది. తుపాను మిగిల్చిన కష్టాన్ని తట్టుకుని మళ్లీ పంట వేసిన అన్నదాతలను ఇప్పుడు సాగు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సాగర్ నుంచి ప్రభుత్వం నీరు విడుదల చేయక పంట చేతికి వచ్చేలా లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆకాశాన్ని తాకిన రసాయనాల ధరలు :ఉద్యాన పంటల సాగుకు పెట్టుబడితో పాటు అదనపు ఖర్చులు ఎక్కువే. అయినప్పటికీ ప్రభుత్వం రాయితీల రూపంలో ఆదుకుంటుందనే ధైర్యంతో సాగు చేస్తున్న కర్షకులకు, జగన్ ప్రభుత్వం మూడేళ్లుగా మొండి చెయ్యే చూపుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 14 కోట్ల బకాయిలు చెల్లించాలి. ప్రభుత్వం సాయం చేయకపోగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు యూరియా, రసాయనాల ధరలను విపరీతంగా పెంచేసి అదనపు భారం మోపుతోందని రైతులు వాపోతున్నారు.