CM Chandrababu Visits Indrakeeladri :ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలను సమర్పించారు. కుటుంబ సమేతంగా దుర్గ గుడికి చంద్రబాబు విచ్చేశారు. వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో ఆలయ సేవా కమిటీ సభ్యులను ఆయన మర్యాదపూర్వకంగా పలకరించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి తలకు స్థానాచార్యులు శివప్రసాదశర్మ పరివేట్టం చుట్టారు. అనంతరం పట్టువస్త్రాలు తలపై పెట్టుకుని దుర్గమ్మ సన్నిధికి వెళ్లారు.
దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు :అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి అంతరాలయంలో జగన్మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి, మంత్రి లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్‌కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. సీఎం వెంట మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనాచౌదరి, కలెక్టర్, పోలీస్ కమిషనర్, దేవదాయశాఖ అధికారులు ఉన్నారు.
ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవిగా దుర్గమ్మ - దర్శనానికి పోటెత్తిన భక్తులు
ప్రజలందరిపైనా దుర్గమ్మ ఆశీస్సులు : ఈ నేపథ్యంలోనే దుర్గమ్మ భక్తులందరికీ సీఎం చంద్రబాబు దసరా శుభాకాంక్షలు తెలిపారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. దుర్గమ్మ దయ వల్ల రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయన్నారు. అమ్మవారి దయతో రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తవ్వాలని వేడుకున్నారు. రాష్ట్ర ప్రజలందరిపైనా దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా లక్షల మంది భక్తులు ఎంతో భక్తితో అమ్మవారిని దర్శించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. భక్తులకు సేవా కమిటీ ద్వారా అనేక రకాల సేవలు అందిస్తున్నామని తెలియజేశారు.
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్
దేవాలయానికి పూర్వ వైభవం :ఇవాళ అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినందుకు దుర్గగుడి పాలకమండలి సభ్యులకు అభినందనలు తెలిపారు. అమ్మవారి సన్నిధిలో సౌకర్యాలు బాగున్నాయని భక్తులు తెలియజేశారని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయని వివరించారు. ప్రతి దేవాలయానికి పూర్వ వైభవం వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు ఎంతో శ్రమించారని కొనియాడారు.
వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు - ఆలయాలకు క్యూ కట్టిన భక్తులు