CM Chandrababu Serious on Fly Ash Dispute:రాయలసీమ బొగ్గు విద్యుదుత్పత్తి కేంద్రం(Rayalaseema Thermal Power Plant) నుంచి బూడిద తరలింపు విషయంలో ఆధిపత్య పోరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద తరలింపు, సరఫరాపై వివాదం నెలకొనగా ఆ ఫ్లైయాష్ వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో సీఎం కూటమి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సీఎం చంద్రబాబు సీఎంవో అధికారులు, జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
బూడిద తరలింపు విషయంలో రాజకీయ వివాదంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని అన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తే ఏమాత్రం సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. మొత్తం ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని, ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.
శాలరీ కావాలంటే 2వేలు పంపండి "సార్" - విద్యాశాఖలో పైసా వసూల్
ఇదీ వివాదం: ఆర్టీపీపీలోని ఉచిత బూడిద కోసం జమ్మలమడుగు, తాడిపత్రికి చెందిన కూటమి నేతలు పట్టుబట్టారు. తాడిపత్రి నుంచి ఫ్లయాష్ కోసం లారీలు వస్తే అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌కు ఘాటులేఖ రాసిన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రి నుంచి వచ్చే వాహనాలను తాళ్ల ప్రొద్దుటూరు, కొండాపురం, ముద్దనూరు, ఆర్టీపీపీ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. జేసీకి చెందిన 6 లారీలు ఆర్టీపీపీ వద్దకు వచ్చినా బూడిద లోడు చేయకుండా నిర్వాహకులు నిలిపివేశారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్టులో తమకు సగ భాగం ఇవ్వాలని స్థానికులు పట్టు బడుతున్నారు. ఇక్కడ ఫ్లైయాష్ లోడు చేసినందుకు, కూలీల ఖర్చులు అన్నీ కలిపి దాదాపు 70 లక్షల రూపాయలు జేసీ ప్రభాకర్ రెడ్డి చెల్లించాలని నిర్వాహకుడు సంజీవరెడ్డి తెలిపాడు. పరిసర ప్రాంతాల్లో నాయకులు ఎవరు లేకుండా పోలీసులు పంపించి వేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీ వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఆర్టీపీపీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. ఉదయం నుంచే ఆర్టీపీపీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
ఆ నేత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - 100కోట్ల కుచ్చుటోపి - సీఐడీకి కేసు బదిలీ
కేంద్రం ఇచ్చే రాయితీ కొంతే - సెకి విద్యుత్‌కు ఐఎస్‌టీఎస్ ఛార్జీలు చెల్లించాల్సిందే!