CM Chandrababu Review on MSME Draft Policy in AP : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం ద్వారా ఐదేళ్లలో రూ. 50,000ల కోట్ల పెట్టుబడులను రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ఇందుకోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కొత్తగా 100 ఎంఎస్‌ఎంఈ పార్కులను అభివృద్ధి చేయడంతోపాటు 500 లకు పైగా ఎంఎస్ఎంఈలను అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ పడేలా తీర్చిదిద్దాలని ప్రణాళిక రచిస్తోంది. అధికారులు ప్రతిపాదించిన ముసాయిదా పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.
రూ. 50 వేల కోట్ల పెట్టుబడులు :మేడిన్ ఆంధ్రా పేరిట ఎంఎస్ఎంఈల ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం కనీసం 500 ఎంఎస్ఎంఈలను గుర్తించి నిర్వాహకులకు అసరమైన శిక్షణ, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సన్నద్ధమవుతోంది. ఎగుమతులకు అవకాశాలున్న 10 రంగాలను గుర్తించి వాటికి సంబంధించి ఎంఎస్ఎంఈల కోసం మార్గదర్శకాలను రూపొందించాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా ఉత్పత్తుల విక్రయాల ప్రదర్శనలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ-కామర్స్ ఎగుమతులకు అనుసంధానం, బిజినెస్ డెవలప్‌మెంట్ సర్వీస్ ప్రొవైడర్ వంటి అంశాల్లో సహకరించాలని యోచిస్తోంది. గ్లోబల్‌ట్రేడ్ ఫెసిలిటేషన్ కల్పించేందుకు వీలుగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలలో 3 కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.అధికారులు ప్రతిపాదించిన ముసాయిదా పాలసీ విధివిధానాలపై సీఎం చంద్రబాబు కొన్ని కీలక మార్పులను సూచించారు.
ఐదేళ్లలో ఐదు లక్షల మందికి ఉపాధి :కొత్తగా ఏర్పాటుచేసే ఎంఎస్ఎంఈలతో పాటు ఇప్పటికే ఉత్పత్తి చేస్తూ సాంకేతికతను మెరుగుపర్చుకుంటున్న ప్రోత్సాహకాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడి, టర్నోవర్ ఆధారంగా ఈ పరిశ్రమలను గుర్తించనుంది. ఫిక్స్‌డ్ కాస్ట్ సబ్సిడీ కింద వాటికి స్టాంపుడ్యూటీ, క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వనుంది. ఆపరేటింగ్ కాస్ట్ కింద ఎస్‌జీఎస్టీ రియంబర్స్‌మెంట్, స్కిల్ అప్‌గ్రేడేషన్ ఖర్చు, లోకల్ ప్రొక్యూర్‌మెంట్ సబ్సిడీ, కేంద్ర పథకాలకు అనుగుణంగా క్వాలిటీ సర్టిఫికేషన్ తీసుకునేందుకు చేసిన మొత్తాన్ని సబ్సిడీ కింద ప్రభుత్వం భరించనుంది.