Chandrababu on Constitution Day :ఎందరో విశిష్ట వ్యక్తులు రూపకల్పన చేసిన రాజ్యాంగం దేశ ప్రజల హక్కుల్ని కాపాడుతోందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం, విశ్వాసం, ధర్మం, భావప్రకటన స్వేచ్ఛను అంతస్తులోనూ, అవకాశాల్లోనూ సమానత్వం కల్పించాలని చెబుతోందని చెప్పారు. ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా అమలు చేస్తున్నవారు మంచివారు కాకపోతే చెడుగా మారుతుందని అంబేడ్కర్ ఆనాడే చెప్పారని పేర్కొన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
'వ్యక్తులుగా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. భారత్లో ఓటు హక్కు ఓ నిశ్శబ్ద విప్లవంగా పనిచేస్తోంది. ఓటు ద్వారానే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలుగుతున్నాం. ఎలాంటి సమస్యైనా, సవాళ్లైనా రాజ్యాంగమే పరిష్కరిస్తోంది. ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు గతంలో వచ్చాయి. ఇటీవల మన రాష్ట్రంలోనూ అలాంటి పరిస్థితులు తలెత్తాయి. రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రాథమిక హక్కుల్ని కాలరాసిన పరిస్థితి చూశాం.' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రజలే బుద్ధి చెబుతారు : ఎవరూ రాజ్యాంగాన్ని అతిక్రమించినా దీని స్పూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించినా ప్రజలే బుద్ధి చెబుతారని చంద్రబాబు తేల్చిచెప్పారు. అధికార దుర్వినియోగం కూడా రాజ్యాంగ ఉల్లంఘనేని చెప్పారు. ఆర్ధిక సంస్కరణల వల్ల సంపద సృష్టి జరుగుతోందని పేర్కొన్నారు. వాటిని చిట్టచివరికి తీసుకెళ్లడంలో సమస్యలు ఉన్నాయని వివరించారు. సంపదను అందరికీ పంచితే ఆర్థిక సమానత్వం వస్తుందని చంద్రబాబు వెల్లడించారు.