CM Chandrababu Naidu Wishes Happy Dussehra to Telugu People :దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ శాంతులతో వర్ధిల్లేలా చూడాలని కనకదుర్గమ్మ తల్లిని వేడుకున్నట్లు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే దసరా పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
ప్రభుత్వానికి ప్రజల మద్దతు, దుర్గమ్మ ఆశీస్సులు లభించాలి : రాష్ట్రాన్ని ధ్వంసం చేసి, ప్రజల్ని హింసించిన జగనాసురుడి దుష్టపాలనను జనమే అంతమొందించారని నారా లోకశ్ అన్నారు. వైఎస్సార్సీపీ చెడుపై కూటమి మంచి విజయం సాధించిందని అన్నారు. వేలాది ఉద్యోగాలు ఇచ్చే లులూ, ఫాక్స్‌కాన్, హెచ్సీఎల్, టీసీఎల్ తెచ్చుకున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా శ్రమిస్తున్న మంచి ప్రభుత్వానికి ప్రజల మద్దతు, దుర్గమ్మ ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నానని అన్నారు.