ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గేరు మార్చి వేగం పెంచుతాం - అధికారులు సిద్ధం కావాలి: చంద్రబాబు - CM CHANDRABABU REVIEW ON RTGS

రియల్‌టైమ్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష - పథకాలు, కార్యక్రమాల అమలుపై ప్రజాభిప్రాయం సేకరించాలని అధికారులకు సూచన

CM_Chandrababu_on_RTGS
CM Chandrababu on Real Time Governance (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2024, 10:33 PM IST

CM Chandrababu on Real Time Governance: కొత్త సంవత్సరం నుంచి పాలనలో గేరు మార్చి వేగం పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వేగానికి తగ్గట్టు అధికారులంతా పని చేయాలని దిశానిర్థేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం సేకరించి అందుకు తగ్గట్టు అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఉచిత ఇసుక విధానం సక్రమ అమలుకు రీచ్‌ల్లో సీసీ కెమెరాలు, వాహనాల జీపీఎస్‌ ద్వారా పర్యవేక్షణ జరగాలని ఆదేశించారు.

ఇసుక విధానంపై ఎప్పటికప్పుడు ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించాలని స్పష్టం చేశారు. దేవాలయాలకు వెళ్లే భక్తులు, ఆర్టీసీ ప్రయాణికులు, ఆసుపత్రులకు వచ్చే రోగుల నుంచి కూడా వారికి అందుతున్న సేవలపై అభిప్రాయం తెలుసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో కూడా క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రియల్ టమ్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్‌ కోడ్: ఇకపై ప్రతి సోమవారం రియల్‌టైమ్ గవర్నెన్స్‌పై సమీక్ష ఉంటుందన్నారు. రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లు, ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్‌ కోడ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికుల అభిప్రాయాలను వేగంగా తెలుసుకుని తదనుగుణంగా ఆర్టీసీ పనితీరు మెరుగుపర్చుకోవాలన్నారు. బస్సు సమయానికి వచ్చిందా? లేదా? బస్సు డ్రైవర్, కండక్టర్లు, సమాచార, ఇతర సిబ్బంది ప్రవర్తన సంతృప్తిగా ఉందా? లేదా? అనే దానిపై ఈ క్యూఆర్ కోడ్‌ల ద్వారా అభిప్రాయాన్ని తెలుసుకోవచ్చన్నారు.

దేవాలయాల్లోనూ: రాష్ట్రంలోని దేవాలయాల్లో కూడా క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ముందుగా ఏడు పెద్ద దేవాలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి, అక్కడి పరిసరాల పరిశుభ్రత, మౌలికసదుపాయాలు, నిర్ణీత వేళకు దర్శనం, క్యూలైన్ల నిర్వహణ, ప్రసాదాల నాణ్యత ఎలా ఉందనే అంశాలపై భక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో కూడా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి రోగులకు అందే సేవలపై అభిప్రాయ సేకరణ చేయాలన్నారు. ముఖ్యంగా వైద్యులు అందుబాటులో ఉన్నారా, మందులు ఆసుపత్రిలో ఇచ్చారా లేక బయట కొనుగోలు చేశారా, ఆసుపత్రిలో పరిశుభ్రత ఎలా ఉంది అనే ప్రశ్నల ద్వారా అభిప్రాయాలను సేకరించాలని ఆదేశించారు.

సాంకేతికత అందిపుచ్చుకోవాలి - తక్కువ సమయంలోనే ఎక్కువ సేవలు అందించాలి : సీఎం చంద్రబాబు

ప్రజల అభిప్రాయాలను సేకరించాలి: ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్క ఆరోగ్య విభాగానికే ఎప్పుడూ లేనివిధంగా బడ్జెట్‌లో రూ.18 వేల కోట్లు కేటాయించామని, ఆ స్థాయిలోనే ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించాలన్నారు. రాష్ట్రంలో రూ.860 కోట్లతో జరుగుతున్న రోడ్ల మరమ్మతులపైనా స్థానిక ప్రజల అభిప్రాయాలను సేకరించాలన్నారు. తద్వారా ఏవైనా ఫిర్యాదులు, అసంతృప్తి ఉంటే దానికి గల కారణాలను విశ్లేషించి పనులు మెరుగుపరచాలన్నారు. ఇప్పటి వరకు 6,228 కి.మీ మేర రహదారులపై గుంతలు పూడ్చినట్లు అధికారులు సీఎంకు వివరించారు. దీపం పథకం, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. పింఛను పంపిణీలో కూడా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను ఇస్తున్నారా లేదా అనేది జీపీఎస్ అనుసంధానం ద్వారా తెలుసుకోవాలన్నారు.

వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి: బెల్లు షాపులు ఎక్కడైనా ఉన్నాయా అన్న సమాచారాన్ని ప్రజల నుంచి తీసుకుని, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ సామాజిక ఆస్తులను జీఐఎస్ ద్వారా గుర్తించే ప్రక్రియ కొలిక్కి వచ్చిందని అధికారులు తెలిపారు. 15,425 పంచాయతీలకు గాను 2,044 పంచాయతీల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తయ్యిందని, మిగిలనవి కూడా జనవరిలోపు పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 47,34,097 మంది పౌరులకు సంబంధించిన సమాచారం లేదని, అందులో ఇప్పటికే కొంతమంది డేటాను సేకరించామని ఇంకా మిగిలిన 31.17 లక్షల మంది డేటా జనవరి నెలాఖరులోపు సేకరిస్తామన్నారు.

అలాగే 6 ఏళ్ల వయసులో ఉన్న 10.23 లక్షల మంది చిన్నారులకు ఆధార్ లేదని, వాళ్లకు కూడా ఆధార్ ఇస్తామని అధికారులు తెలిపారు. 17 శాఖలకు సంబంధించి డేటా అనుసంధాన ప్రక్రియ వేగంగా జరుగుతోందని చెప్పారు. డ్రోన్ల సేవలు రాష్ట్రంలో ఎవరికి అవసరం ఉందో ఆ సమాచారాన్ని సేకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులకు డ్రోన్లు వినియోగం అందుబాటులోకి తెస్తే వారికి సమయంతో పాటు అదనపు ఖర్చు తగ్గుతుందని అన్నారు. ఇకనుంచి టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌తో పాటు ఆడిట్ కూడా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రియల్ టైం గవర్నెన్స్‌ ద్వారా పౌరసేవలు - ప్రాజెక్ట్​ సిద్ధం చేయాలి: సీఎం చంద్రబాబు - CHANDRABABU VISITED RTGS

ABOUT THE AUTHOR

...view details