CM Chandrababu on Kadapa Incident: కడప జిల్లా బద్వేల్‌లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలికావడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ సీఎంకు వివరించారు. వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడమంటే హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా శిక్షించడమేనని సీఎం తేల్చిచెప్పారు. ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నిందితుడికి శిక్షపడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఘటనలో నిందితుడికి మరణ శిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి సూచించారు. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలన్నారు.
బద్వేల్‌లో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి
Home Minister on Kadapa Incident: కడప జిల్లాలో పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మరణం విషాదకరమని హోం మంత్రి వంగలపూడి అనిత వాపోయారు. తీవ్రంగా గాయపడి కోలుకోలేక ఆస్పత్రిలో మృతి చెందడంపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలికపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తీవ్రంగా కలచివేశాయన్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన విఘ్నేష్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో 4 బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి అరెస్ట్ చేశామన్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని, అందుకు సహకరించిన వారిని చట్టప్రకారం వెంటనే కఠిన శిక్షపడేలా చేస్తామన్నారు. బాధితురాలి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామి ఇచ్చారు.
BJP Purandeswari on Kadapa Incident: విద్యార్థిని హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్ చేశారు. విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి హత్య చేసిన ఘటనపై పురందేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. కడప జిల్లాలో పెట్రోల్ పోసి హత్య చేసిన దోషిని వెంటనే శిక్షించాలని, ఈ ఘటనలో సహకరించిన ప్రతి ఒక్కరికీ చట్ట ప్రకారం శిక్షలు పడే విధంగా కేసులు నమోదు చేయాలన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ముద్దాయిలకు కఠిన శిక్షలు పడాలని అభిప్రాయపడ్డారు.
వైఎస్సార్ జిల్లాలో దారుణం - ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కీచకుడు