ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో పెట్టుబడులకు విస్తృత ప్రయత్నాలు - 15కు పైగా సంస్థలతో సీఎం వరుస భేటీలు - CM MEETS GLOBAL CEOS IN DAVOS

దావోస్‌లో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటన - ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు

_cm_meets_global_ceos_in_davos
_cm_meets_global_ceos_in_davos (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2025, 10:52 PM IST

CM Chandrababu meets Global CEOs in Davos:దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు బృందం పెట్టుబడులు ఓడిసి పట్టేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. విరామం లేకుండా రెండో రోజూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సముద్ర రవాణా దిగ్గజ సంస్థ మెరెస్కే ఆసక్తి చూపింది. ఎల్జీ కెమ్, సిస్కో, కార్ల్స్‌బెర్గ్ సీఈవోలతోనూ సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో అవకాశాలు పరిశీలించాలని సీఎం సూచించారు.

తీరప్రాంతం, పోర్టులు ఏపీ బలం: ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలలో ఒకటైన డెన్మార్క్‌కు చెందిన మెర్ఎస్కే సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. 130 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ప్రపంచ రవాణా రంగంలో ప్రముఖ వాటా కలిగి ఉన్న మెర్​ఎస్కే రాష్ట్రానికి వస్తే సముద్రరవాణాలో దేశంలోనే ఏపీ అగ్రగామి రాష్ట్రం అవుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మెర్​ఎస్కే కంపెనీ సీఈవో విన్సెంట్ క్లర్క్‌తో సీఎం చర్చలు జరిపారు.

1000 కిలోమీటర్ల పైగా తీరప్రాంతం కలిగి ఉండటం, విస్తారంగా పోర్టులు ఉండటం ఏపీకి బలమని విన్సెంట్ క్లర్క్‌కు సీఎం తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఉత్పత్తులు, వాణిజ్య వస్తువులు సముద్ర మార్గం ద్వారా రవాణా చేయడంలో ఆ సంస్థ కీలకంగా ఉందని ఏపీకి వస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆసియా పసిఫిక్ మార్కెట్లకు రవాణా హబ్‌గా ఏపీ మారే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

దావోస్​లో మంత్రి లోకేశ్ బిజీబిజీ - పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు

గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటు: మరోవైపు ఈథర్‌నెట్, ఆప్టికల్, వైర్‌లెస్, మొబిలిటీ వంటి నెట్‌వర్కింగ్‌లో సాంకేతికతలను అందించడం, డేటా సెంటర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో పేరున్న మల్టీ-నేషనల్ టెక్నాలజీ సంస్థ సిస్కో చైర్మన్, సీఈవో చుక్ రాబిన్స్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామి కావాలని చుక్ రాబిన్స్ దగ్గర సీఎం ఆకాంక్ష వ్యక్తం చేశారు. విశాఖపట్నం లేదా తిరుపతిలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటుకు యోచన చేయాలని రాష్ట్రంలో ప్రతిభకు లోటు లేదని చెప్పారు. ఎల్జీ కెమ్ లిమిటెడ్ సీఈవో షిన్ హక్ చియోల్‌కు రాష్ట్రంలో వివిధరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు.

వేగంగా అయ్యేలా పూర్తి మద్దతు: లిథియం- అయాన్ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు యోచనలో ఉన్న ఎల్జీ కెమ్‌ అనుబంధ సంస్థ ఎనర్జీని రాష్ట్రంలో నెలకొల్పాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. పెట్రో కెమికల్ రంగంలో యూనిట్లు మూలపేట - విశాఖలోనూ, సెమీకండక్టర్ యూనిట్ తిరుపతిలోనూ నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించమని సూచించారు. రాష్ట్రంలో తయారీకి అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు వేగంగా ప్లాంట్ ఏర్పాటయ్యేలా పూర్తి మద్దతిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్, దక్షిణ కొరియా మధ్య పెట్టుబడుల కోసం ఎల్జీ కెమ్ సీఈవోను అంబాసిడర్‌గా ఉండాలని అభ్యర్ధించారు.

గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌కు ఏపీ హబ్‌గా మారబోతోంది: సీఎం చంద్రబాబు

పళ్ల రసాలు, శీతల పానీయాలు, బీర్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌, ఉత్పత్తి చేసే కార్ల్స్ బెర్గ్ గ్రూప్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్‌తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ, బాట్లింగ్ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయమని కోరారు. ఇందుకోసం విశాఖపట్నం, కృష్ణపట్నం, శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించమని సూచించారు. బార్లీ, మొక్కజొన్న, వరి వంటి అధిక నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సేకరించేందుకు రాష్ట్రంలోని రైతులతో భాగస్వామి కావాల్సిందిగా కోరారు.

విశాఖలో రీజనల్ టెక్నాలజీ హబ్ ఏర్పాటు: ఉబెర్ వైస్ ప్రెసిడెంట్ మధుకానన్​తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఐటి పర్యావరణ వ్యవస్థ, నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్, తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలను పెంచేందుకు విశాఖలో రీజనల్ టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేయలని కోరారు. ఆంధ్రప్రదేశ్​లో ఎలక్ట్రిక్ వాహనరంగం వేగం పుంజుకుంటున్నందున రాష్ట్రమంతటా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయలన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలతోపాటు స్థిరమైన పట్టణ రవాణాకు మద్దతుగా ఉబెర్ ఫ్లీట్‌లో ఈవీలను సమగ్రపరచి సేవలందించాలన్నారు.

రాష్ట్రంలో ముఖ్యమైన నదులు, కాలువలు, సరస్సుల వెంబడి ఇన్ ల్యాండ్ వాటర్ వే సర్వీస్​ను పరిచయం చేయాలని కోరారు. ఈవీ టెక్నాలజీ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, కస్టమర్ సేవలో డ్రైవర్‌లు, మెకానిక్‌లు, ఫ్లీట్ ఆపరేటర్‌లకు శిక్షణ ఇవ్వడం, అప్‌స్కిల్ చేయడానికి ఏపి స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC)తో కలిసి పనిచేయాలని లోకేశ్ తెలిపారు. పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నందున క్యూరేటెడ్ మార్గాలు, హెరిటేజ్ సైట్‌లలో ఎలక్ట్రిక్ షటిల్ సేవలు, టూరిజం-హెవీ జోన్‌లలో మెరుగైన రైడ్-హెయిలింగ్ సేవలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని ఉబెర్ వైస్ చైర్మన్ మధుకానన్ హామీ ఇచ్చారు.

ఏపీలో మెగా సిటీలుగా ఆ ప్రాంతాలు - అమరావతి ఓఆర్‌ఆర్​తో మారనున్న రూపురేఖలు

ABOUT THE AUTHOR

...view details