CM Chandrababu Naidu Directions to Ministers :గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలు రావడంతో ప్రజలు నానాకష్టాలు పడుతున్నారు. వరి పంట దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ముంపునకు గురైన పంట : హోంశాఖ, వ్యవసాయ శాఖ మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లి వరద బాధితుల్ని పరామర్శించాలని చంద్రబాబు ఆదేశించారు. దిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం కారణంగా బాధితుల్ని పరామర్శించేందుకు తాను వెళ్లలేకపోతున్నానని అన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలు వరద ప్రభావానికి లోనయ్యాయని తెలిపారు. వరి పంట 4,317 ఎకరాల్లో దెబ్బతిందని, 1.06 లక్షల ఎకరాల్లో నాట్లు వేసిన పంట ముంపునకు గురైందని పేర్కొన్నారు. మొక్కజొన్న, పత్తి పంటలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు.
గోదావరి వరద ముంపులో వందలాది గ్రామాలు, వేలాది ఎకరాలు - People Suffer in FLOOD WATER
పంట నష్టాన్ని అంచనా వేయండి : అల్లూరి జిల్లాలోనూ కొన్ని చోట్ల వరద ప్రభావం ఉందని సీఎం అన్నారు. ఇప్పటికీ తూర్పు గోదావరిలో వేలాది ఎకరాల పంట నీట మునిగి ఉందని పేర్కొన్నారు. ఇళ్లు నీట మునిగిన వారికి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపుల్లో ఉన్న కుటుంబాలకు రూ.3 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించాలని సూచించారు. 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కేజీ చొప్పున సాయం ఇవ్వాలని స్పష్టం చేశారు. పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయాలని మంత్రులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.