CM Chandrababu Delhi Tour Updates : కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం కోరే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిల్లీకి వెళ్లారు. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, రహదారులు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్, ఇతర అధికారులు సీఎం వెంట ఉన్నారు. బుధవారం రాత్రి చంద్రబాబు టీడీపీ, బీజేపీ, జనసేన ఎంపీలతో సమావేశయ్యారు. పార్లమెంట్ తొలి సమావేశాలు జరిగిన తీరును తెలుసుకున్నారు. భవిష్యత్‌లో ఏపీ సమస్యల పరిష్కారం కోసం ఎంపీలు నిర్వహించాల్సిన పాత్రపై చర్చించినట్లు తెలిసింది.
Chandrababu Meet PM Modi Today : గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానమంత్రి, ఇతర కేంద్రమంత్రుల దృష్టికి సీఎం చంద్రబాబు నాయుడు తీసుకెళ్లనున్నారు. ఏపీకి పారిశ్రామిక రాయితీలను కల్పించాలని, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు.
ఏపీకి సాయం చేయాలని కేంద్రాన్ని కోరనున్న సీఎం : ఆర్థికంగా, మౌలిక వసతుల పరంగా ఏపీకి సాయం చేయాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తిచేయడం, అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే, రహదారుల మరమ్మతులు, పట్టణ, గ్రామీణ పేదల ఇళ్లు, జల్‌జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీరు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు చేయనున్నట్లు తెలిసింది.