CM Chandrababu Distributed Pensions:అణగారిన వర్గాలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా నేమకల్లులో ఇంటింటికి పింఛన్ల పంపిణీలో సీఎం పాల్గొన్నారు. వితంతువు రుద్రమ్మ ఇంటికెళ్లిన సీఎం ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె కుటుంబసభ్యులతోనూ మాట్లాడారు. అనంతరం రుద్రమ్మకు స్వయంగా సీఎం పెన్షన్ అందించారు. ఇల్లు లేదని రుద్రమ్మ చెప్పడంతో వారికి వీలైనంత త్వరగా స్థలం కేటాయించి ఇల్లు కట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా నేమకల్లులో దివ్యాంగురాలు భాగ్యమ్మ ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు. భాగ్యమ్మ కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భాగ్యమ్మకు దివ్యాంగ పింఛను 15 వేల రూపాయలను అందించారు. నేరుగా ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి పెన్షన్ అందించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ జగదీష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు తమ గ్రామానికి రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
పింఛను ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదే:పింఛన్ల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన గ్రామసభలో సీఎం మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 64లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని సీఎం తెలిపారు. దేశవ్యాప్తంగా పింఛను ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదేనని తెలిపారు. పింఛన్ల కింద 5 నెలల్లో రూ.18వేల కోట్లు ఇచ్చామని పెంచిన పింఛన్లు ఏప్రిల్ నుంచి ఇచ్చామని తెలిపారు. పింఛను 3 నెలలకోసారి తీసుకునే సౌకర్యం కల్పించామని అన్నారు. లబ్ధిదారుల్లో కూలీలు, కార్మికులు ఉన్నారనే ఇలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల్లో ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. అనంతపురం జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.
సెకి ఒప్పందంపై అభ్యంతరాలన్నీ తూచ్ - జగన్ అవినీతికి ఇవే సాక్ష్యాలు!
రాయలసీమను రతనాల సీమగా మార్చుతా: రాయదుర్గం వెనకబడిన ప్రాంతమని ఈ నియోజకవర్గం ఏడారిగా మారకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. హంద్రీనీవాపై రూ.4,500 కోట్లు, రాయలసీమలోని ప్రాజెక్టులకు రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టామని సీఎం వివరించారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కష్టపడి పనిచేసి సంపద పెంచి పేదలకు పంచుతామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 50 లక్షల మంది గ్యాస్ బుక్ చేసుకున్నారని సిలిండర్‌కు చెల్లించిన డబ్బు 48 గంటల్లో రిఫండ్ చేస్తున్నామని తెలిపారు. గత ఐదేళ్లు ఇసుక దొరక్క లక్షల మంది కూలీలు ఉపాధి కోల్పోయారని ఇక ఇసుక విషయంలో ఎవరు అడ్డువచ్చినా ఊరుకునేది లేదని చంద్రబాబు అన్నారు.
నెంబర్‌వన్ రాష్ట్రంగా ఏపీ:నా విజన్ వల్ల దేశంలోనే నెంబర్‌వన్ నగరంగా హైదరాబాద్ తయారైందని సీఎం అన్నారు. 2047 నాటికి దేశంలోనే ఏపీ నెంబర్‌వన్ రాష్ట్రంగా మారాలన్నారు. ప్రపంచాన్ని శాసించే శక్తియుక్తులు మన పిల్లలకున్నాయని, పిల్లలను చదివించాలి, వారిలో నైపుణ్యాలు పెంచాలని సూచించారు. స్థానిక సంస్థల్లో పోటీకి పిల్లల నియంత్రణ చట్టం తీసేశామని తెలిపారు. చదువుకున్న యువతే మన రాష్ట్రానికి పెద్ద ఆస్తి అని చంద్రబాబు అన్నారు.