CM Chandrababu Direct Interaction With Farmers in Krishna District :ధాన్యం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మద్దతు ధర లభిస్తుందో లేదో తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో పర్యటించనున్న సీఎం రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు.
ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన ధాన్యాన్ని మద్ధతు ధరతో కొనుగోలు చేయడంతో పాటు 24 గంటల వ్యవధిలోనే అన్నదాతలు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం సొమ్ము జమ చేస్తోంది. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నా ధాన్యం విక్రయాల్లో కొన్ని ఇబ్బందులపై మాత్రం ఆవేదన చెందుతున్నారు. రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులను స్వయంగా తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో రైతుల వద్దకే వెళ్లి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు.
ఉదయం ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి గంగూరు చేరుకోనున్నారు. అక్కడ రైతు సేవాకేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించి సిబ్బంది, రైతులు, అధికారులతో ముచ్చటించనున్నారు. ఆ పక్కనే ఉన్న వెంకటాద్రి ధాన్యం మిల్లును తనిఖీ చేయనున్నారు. మధ్యాహ్నం ఈడ్పుగల్లు చేరుకుని రెవెన్యూ సదస్సులో పాల్గొంటారు. అక్కడ లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. రైతులతోనూ ముచ్చటించనున్నారు.