Land Dispute in Marripadu : నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మర్రిపాడు మండలం నాగినేనిగుంటలో ప్రభుత్వ భూమి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. సాగు విషయంలో చెలరేగిన వివాదం కాస్తా ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. గ్రామానికి చెందిన 332వ సర్వే నంబర్లో 2.50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ పొలం విషయంలో ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
గత కొంత కాలంగా ఒక వర్గం ఆ భూమిని సాగు చేసుకుంటోంది. మరో వర్గం వారు ఇవాళ ట్రాక్టర్‌తో భూమిని చదును చేసేందుకు యత్నించగా తాము మొదటి నుంచి సాగు చేస్తున్నామని వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒక వర్గం వారిని మరో వర్గం ట్రాక్టర్‌తో ఢీకొట్టింది. దీంతో కర్రలతో ప్రతిదాడులకు మరో వర్గం దిగింది. ఈ దాడుల్లో మహిళలతో సహా మొత్తం 12 మందికి గాయాలయ్యాయి.