Clashes Between Players In Aadudam Andhra Tournament in AP : రాష్ట్రంలో జరుగుతున్న 'ఆడుదాం ఆంధ్ర' క్రీడా పోటీలు చివరకు యువకుల మధ్య వివాదానికి కారణమవుతున్నాయి. రాష్ట్రంలో పోటీలు ఎక్కడ నిర్వహించినా ఇరు జట్ల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలతో తీవ్ర ఘర్షణకు దారి తీస్తున్నాయి. దీంతో చాలా మంది క్రీడా కారులు తీవ్రంగా గాయాపడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే విజయనగరంలో చోటు చేసుకుంది.
'ఆడుదాం ఆంధ్ర' పోటీల్లో తీవ్ర ఘర్షణలు - సహనం కోల్పోతున్న క్రీడాకారులు 'ఆడుదాం ఆంధ్ర' పోటీల్లో బాహాబాహీ- ఇరుజట్ల మధ్య తీవ్ర వాగ్వాదం
ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి క్రీడా పోటీలు గత రెండు రోజులుగా విజయనగరంలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం జరిగిన టోర్నమెంటులో క్రీడా నిర్వాహకులు కొందరిపై వివక్ష చూపుతున్నారని కొంతమంది క్రీడాకారులు మండిపడ్డారు. దీంతో అలాంటిదేమీ లేదని మరికొందరు వాదించారు. చివరికి ఇరు జట్ల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం తోపులాటకు దారి తీసింది. దీంతో అక్కడ ఉన్న రిఫరీలు, వ్యాయామ ఉపాధ్యాయులు భయంతో బయటకు వచ్చేశారు.
Aadudam Andhra Tournament in Vizianagaram: చివరికి వాగ్వాదం తీవ్రం కావడంతో పరిస్థితి అదుపు తప్పుతుందని గమనించిన నిర్వాహకులు రెండో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి క్రీడాకారులను శాంతింపజేశారు. అయితే అధికార పార్టీకి చెందిన నాయకులు ఎవరికి వారు స్థానికత చూపించడం వల్లే ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని నిర్వాహకులు మాట్లాడుకుంటున్నారు.
ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో యువకుల ఘర్షణ - కబడ్డీ క్రీడాకారుల బాహాబాహీ
అయితే గురువారం పురుషుల కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలో రాజీం, చీపురుపల్లి జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్స్ జరుగుతున్నాయి. రాజీం జట్టు తరుపున ఆడుతున్న వారు ఆ ప్రాంతం వాసులు కాదని, వారు వేరే ప్రాంతం వారని చీపురుపల్లి జట్టు వాళ్లు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలో బొబ్బిలి - విజయనగరం జట్ల మధ్య జరిగిన టోర్నమెంటులో విజయనగరం జట్టు క్రీడాకారిణులు తక్కువ స్కోర్ చేశారు. అయినా వాళ్లనే సెమీ ఫైనల్కు ఎలా ఎంపిక చేస్తారని బొబ్బిలి జట్టు క్రీడాకారిణులు అభ్యంతరం తెలుపుతూ డీఎస్ఏ కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో విషయం బయటకు పొక్కడంతో మిగిలిన క్రీడాకారులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కేకలతో రాజీవ్ గాంధీ స్టేడియం దద్దరిల్లింది.
'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమంలో ఘర్షణ
ఇలాంటి ఘటనలే ఇదివరకు అనంతపురం జిల్లాలోనూ జరిగాయి. రాయదుర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన 'ఆడుదాం ఆంధ్ర' పోటీల్లో ఇరు జట్లు బాహాబాహీకి దిగాయి. ప్రధానంగా మండలంలోని రాయదుర్గం కోటవీధి, జుంజురంపల్లి గ్రామాల జట్లు మధ్య కబడ్డీ పోటీ జరిగింది. పాయింట్ల విషయంలో ఇరుజట్ల క్రీడాకారుల మధ్య వివాదం చోటు చేసుకుంది. అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ క్రీడాకారులు గొడవకు దిగారు.