CID Inspections at Distilleries in AP :రాష్ట్రంలోని మద్యం తయారీ డిస్టిలరీలు, బెవరేజెస్ కంపెనీల్లో సీఐడీ అధికారులు విస్తృతంగా ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. దస్త్రాలను పరిశీలిస్తున్నారు. బాట్లింగ్ యూనిట్లలో ఉత్పత్తుల నిల్వ సహా తదితర వివరాలు అధికారులు సేకరిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా :ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలోని సెంటనీ బయోటెక్ కర్మాగారంలో ఏపీ సీఐడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కర్మాగారంలోని మద్యం తయారీ బాటిలింగ్ యూనిట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. సీఐడీ అధికారుల ఆదేశాల మేరకు కంచికచర్ల ఎక్సైజ్ అధికారులు కర్మాగారం లోపలికి వెళ్లారు. కర్మాగారంలోకి ఎవరిని అనుమతి ప్రధాన గేటు వద్దనే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సీఐడీ అధికారులు బాటిలింగ్ యూనిట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. గంపలగూడెం మండలం చింతలనర్వ వద్ద ఉన్న శార్వాణి మద్యం తయారీ కంపెనీలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
వైఎస్సార్ జిల్లా : కడప శివారులోని ఈగల్ డిస్టలరీలో సీఐడీ ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా సోదాలు చేస్తున్నారు. సోదాల్లో భాగంగా గత ఏడాది నుంచి ఎంత మద్యం తయారు చేశారు. ఎన్ని వేల లీటర్ల మద్యాన్ని విక్రయించారని వివరాలన్నింటిని సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మద్యం తయారీలో నిబంధనల మేరకు నాణ్యత పాటిస్తున్నారా లేదా అని పరిశీలిస్తున్నారు. ఐదుగురు సీఐడీ అధికారులు వచ్చి దస్త్రాలను పరిశీలిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని వివరాలను సీఐడీ అధికారులు రాబడుతున్నారు. సిబ్బంది ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. సీఐడీ సోదాలు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
ఏలూరు జిల్లా :ఏలూరు జిల్లా ఉంగుటూరు, పెదవేగి మండలాల్లోని పలు మద్యం డిస్టిలరీల్లో సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉంగుటూరు మండలం చెబ్రోలులోని సోరింగ్ స్పిరిట్స్, పెదవేగి మండలం వంగూరులోని గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్‌కి చెందిన డిస్టిలరిల్లో ఉదయం నుంచి అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. రాజమహేంద్రవరం సీఐడీ అదనపు ఎస్పీ ఆస్మాన్ ఫరహీన్ ఆధ్వర్యంలో తనిఖీలు సాగుతుండగా వైఎస్సార్సీపీ హయాంలో డిస్టిలరీల్లో జరిగిన అవకతవకలపై అధికారులు ఆరా తీస్తున్నారు.