CID Inquiry Madanapalle Incident : వైఎస్సార్సీపీ పాలనలో భూ దందా, అక్రమాలను కప్పిపుచ్చే లక్ష్యంతో సాగిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దస్త్రాల దహనం కేసు గుట్టు తేల్చేందుకు సీఐడీ విచారణను ముమ్మరం చేసింది. అగ్నిప్రమాదంలో దగ్ధమైన దస్త్రాల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు కుట్రలో గత పాలకుల హస్తం ఉందన్న ఆరోపణల నిగ్గు తేల్చేందుకు సిఐడీ విచారణను విస్తృతం చేసింది.
శాంతి భద్రతల విభాగం చేపట్టిన విచారణలో సేకరించిన ఆధారాలతో సీఐడీ అధికారులు నేరుగా రంగంలోకి దిగారు.సీఐడీ విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్ మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఆ రోజు జరిగిన ఘటనపై సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసి వివరాలు సేకరించారు. అగ్నిమాపక సిబ్బందిని ప్రమాదం జరిగిన రోజున ఎన్ని గంటలకు ఘటనాస్థలానికి వచ్చారు? మంటలను అదుపు చేసేందుకు పట్టిన సమయం గురించి ఆరా తీశారు.
Madanapalle Files Burnt Case :సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ కూర్చునే ప్రాంతంలో బీరువాలు అందులో ఉన్న ఆయిల్ క్యాన్ల గురించి సీఐడీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు వీడియో రికార్డ్ చేశారు. ట్రాన్స్‌కో అధికారులను పిలిపించి విచారించారు. ప్రమాదం జరిగిన రోజు ఇచ్చిన నివేదికను వారి ముందుంచి వాటిలో ఏమైనా మార్పులు ఉన్నాయా అంటూ వారిని ప్రశ్నించి వివరాలు రాబట్టారు.