CID Inquiry Into TDR Bonds Scam : టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై మరింత లోతుగా ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. ఈ అంశాన్ని మంత్రి నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. సీఐడీ విచారణకు ఇస్తేనే అసలు సూత్రధారులు ఎవరన్న అంశం వెలుగులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరిపై ఆరోపణలు ఉన్నాయి. తణుకు టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిన తీరును మంత్రి నారాయణ సీఎం చంద్రబాబుకు వివరించారు.
ఈ వ్యవహారం కోర్టులో ఉండటంతో ప్రభుత్వం న్యాయనిపుణులతో సంప్రదింపులు చేస్తుంది. తణుకు మున్సిపాలిటీలో 754 కోట్ల రూపాయల మేర బాండ్లు జారీ చేసినట్టు పురపాలక శాఖ, అవినీతి నిరోధక శాఖలు గుర్తించాయి. మొత్తం 691 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. బాండ్ల జారీకి అనుసరించిన విధానంపై ప్రభుత్వ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. స్థల సేకరణ సయయంలో ఎకరాల్లో గుర్తించి బాండ్ల జారీకి చదరపు గజాల్లో స్థలం లెక్కించినట్టు ప్రభుత్వం గుర్తించింది.
ఎకరా 55 లక్షలకు సేకరించి బాండ్ల జారీకి ఎకరా 10 కోట్లు విలువ చూపడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్ సహా ముగ్గుర్ని సస్పెండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2019-24 మధ్య కాలంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్లపై ప్రభుత్వం అంతర్గత విచారణ చేస్తుంది.