MLA Chintamaneni Prabhakar Shawls Turned Dresses :చింతమనేని ప్రభాకర్ ఈ పేరు వింటేనేముక్కుమీద కోపం! దూకుడు స్వభావం! ప్రత్యర్ధులకు సింహస్వప్నం. మొత్తంగా ఆయనో ఫైర్ బ్రాండ్. నిత్యం వినిపించే ఈ మాటలకు భిన్నంగా ఆయనలో మరో కోణం ఉంది. అభాగ్యులకు చేయూత నిచ్చే దాతృత్వం. నిరుపేదరకు నేనున్నా అంటూ అండగా నిలబడే మనస్తత్వం. చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆయన తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేంటే మీరే చూడండి.
వినూత్న కార్యక్రమానికి శ్రీకారం :దెందులూరు టైగర్, ఆంధ్రా మాస్ లీడర్ అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకునే చింతమనేని ప్రభాకర్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. దూకుడు స్వభావంతో విమర్శలూ ఎదుర్కొన్నారు. అయితే అదంతా నాణేనికి ఒక పార్శ్వం మాత్రమే. చింతమనేని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా దశాబ్దానికి పైగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆయన వాటిని పెద్దగా ప్రచారం చేసుకోరు. ఇప్పటికీ తన నివాసం వద్ద చింతమనేని ఎన్టీఆర్ జనతా క్యాంటీన్ పేరుతో తనను కలవడానికి వచ్చే వారికి, పేదలకు వందల మందికి ఉదయం అల్పాహారం అందిస్తున్నారు. తాజాగా తన కుమార్తెకు వచ్చిన ఆలోచనతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
కోడి పందేలు నా వ్యసనం.. కానీ : చింతమనేని
ది గివ్ బ్యాక్ :తనను కలవడానికి వచ్చిన అభిమానులు, తెలిసినవారు తెచ్చిన శాలువాలు భద్రపరిచిన ఆయనకు వాటిని ఏం చేయాలో పాలుపోలేదు. అయితే తన పెద్ద కుమార్తె సలహాతో వాటిని అందంగా, చూడముచ్చటగా ఫ్రాక్‌లు, టాప్‌లుగా కుట్టించి అనాథ, పేద పిల్లలకు పంపిణీ చేస్తున్నారు. కుమార్తెకు వచ్చిన ఆలోచన నచ్చడంతో వెంటనే దానికి "ది గివ్ బ్యాక్" అనే పేరు పెట్టి కార్యరూపం ఇచ్చిన ఆయన శాలువాలను మూడు క్యాటగిరీలుగా విభజించి మొదటిదాన్లో దేవుడి చిత్రాలు, పేర్లు ఉన్న వాటిని వేరుచేసి వాటిని పేద బ్రాహ్మణులకు ఇస్తున్నారు. రెండో క్యాటగిరీలో కొంచెం మందంగా, దళసరిగా ఉండి కత్తిరించినప్పుడు పోగులు వచ్చే వాటిని దుస్తుల కోసం వాడకుండా వృద్ధులకు పంపిణీ చేస్తున్నారు. ఇక మూడో క్యాటగిరీలో ఆకర్షణీయంగా ఉన్న పట్టు శాలువాలు, ఖరీదైన వాటిని దుస్తుల కోసం వినియోగిస్తున్నారు.
డ్రెస్ కోసం 450 రూపాయలు ఖర్చు : ఏదో చేశామంటే చేశామని కాకుండా చింతమనేని సతీమణి, పెద్ద కుమార్తె వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఒక్కో డ్రెస్ కోసం 450 రూపాయలు వెచ్చించి మరీ వీటిని కుట్టిస్తున్నారు. అందరికీ ఏకరూపంగా కాకుండా పిల్లల నుంచి ముందుగా కొలతలు తీసుకుని దుస్తులు కుట్టించి ఇస్తున్నారు. ఇప్పటిదాకా 200 మందికి పైగా అనాథలు, పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. భవిష్యత్తులోనూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు చెబుతున్నారు.
ఇలాంటి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులందరూ చేపడితే ఎంతో మంది అనాథలు, పేద పిల్లలకు మంచి దుస్తులు అందించినవారవుతారని చింతమనేని అభిప్రాయపడుతున్నారు.
రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక బురదచల్లే ప్రయత్నం: చింతమనేని - Chinchamaneni Fire on YCP Leaders