నీటి నమూనాల్లో హానికర బ్యాక్టీరియా - విషజ్వరాలతో అల్లాడుతున్న గ్రామస్థులు (ETV Bharat) Chinnampeta People Suffering From Poisonous Fevers: అకస్మాత్తుగా విపరీతమైన జ్వరం ఉదయానికి ఒళ్లంతా వాపులు భరించలేని కీళ్ల నొప్పులు. అడుగు తీసి అడుగు వేయలేని దయనీయ స్థితి. ఇది ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామస్థులు గత నాలుగు నెలలుగా అనుభవిస్తున్న నరకయాతన. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇంత జరుగుతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోవటంలో అధికారుల వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి. విష జ్వరాల వ్యాప్తికి వందల మంది బాధితులుగా మారుతున్నా మూలాలను గోప్యంగా ఉంచుతున్నారన్న విమర్శలున్నాయి. కలుషితమైన తాగునీరు, పారిశుద్ధ్య లోపాలతో వ్యాప్తి చెందిన దోమలే కారణాలుగా తెలుస్తున్నాయి.
పడకేసిన పారిశుద్ధ్యం.. విజృంభిస్తున్న జ్వరాలు.. అల్లాడుతున్న ప్రజలు
వ్యాధి మూలాలపై స్పష్టత కరవు:ఏలూరు జిల్లా చిన్నంపేట గ్రామంలో 3901 మంది జనాభా ఉంటే ఇప్పటి వరకు 1000 మందికి పైగా విష జర్వాలతో బాధపడుతున్నారు. కుటుంబంలో అయిదుగురు సభ్యులుంటే వారిలో ముగ్గురు బాధితులున్నారు. ప్రతి నలుగురిలో ఒక బాధితుడు తప్పనిసరి. అధికారులు మాత్రం నోటికొచ్చిన లెక్కలేస్తున్నారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఇప్పటి వరకు 40 మందే బాధితులని చెబుతున్నారు. గ్రామంలోని వైద్య శిబిరంలో సిబ్బంది 173 మందికి జ్వరాలు వచ్చాయని పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. క్ష్రేత్రస్థాయిలో మాత్రం వందల మంది బాధితులు కనిపిస్తున్నారు.
గుంటూరులో విజృంభిస్తున్న విష జ్వరాలు.. డ్రైనేజి నిర్వాహణ లేమితోనే వ్యాధులంటున్న బాధితులు
అధ్వానంగా పారిశుద్ధ్యం:ఫిబ్రవరిలో విషజ్వరాల వ్యాప్తి మొదలై ఇప్పటికీ కొనసాగుతోంది. జ్వరం, ఒళ్లంతా వాచిపోవటం, కీళ్ల నొప్పులతో మంచాన పడుతున్నారు. ఆ నొప్పులు, వాపు పూర్తిగా తగ్గే సరికి మూడు నెలలకుపైగా పడుతోంది. అరకొర వైద్య శిబిరాలతో ఫలితం లేదని బాధితుల్లో 80 శాతం మంది వరకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. ఒక్కో బాధితుడికి రూ.25 వేల నుంచి రూ. 30వేల వరకు ఖర్చవుతోంది. ఇంత జరుగుతున్నా కాలం గడుస్తున్నా అధికారులు వ్యాధి మూలాలను వెల్లడించడం లేదు. ఐదు సార్లు వైద్య శిబిరాలు, రెండు సర్వేలు చేయటం తప్ప వారి వల్ల ఒరిగిందేమిటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.
నరసాపురంలో విజృంభిస్తున్న జ్వరాలు..పట్టించుకోని ప్రభుత్వ వైద్యాధికారులు
అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ:జ్వరాల నేపథ్యంలో అధికారులు నీటి నమూనాలు సేకరించి పరీక్షించగా కొనేరు, చెరువు కట్టలపై ఉన్న రెండు చేతి పంపుల నుంచి తీసిన నమూనాలో కెబ్ష్‌ల్ అనే హానికర బ్యాక్టీరియా ఉందని తేలింది. మూడు ప్లాంట్లలో ఒకదానిలో తాగునీరు కూడా ప్రమాణాలకు తగ్గట్టుగా లేదని ప్రాథమికంగా గుర్తించారు. దీంతో ఆ ప్లాంటులో నీటి అమ్మకాలను నిలిపేయాలని నిర్వాహకులకు ఆదేశించారు. ఈ విషయాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. గ్రామంలో ఎక్కువ మంది ఈ మూడు చోట్లే నీరు తాగుతున్నారు.
పారిశుద్ధ్య నిర్వహణలో లోపం: గ్రామంలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ లోపాలతోనే ఈ విపత్తు వచ్చిందని తెలుస్తున్నా అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకోవటం లేదు. నాలుగు నెలలుగా వ్యాధి ప్రబలుతున్నా బ్లీచింగ్ కూడా చల్లడం లేదు. డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. మురుగు పారే మార్గం లేక నివాసాల మధ్య దుర్గంధం వెదజల్లుతోంది. తొలగించేందుకు పంచాయతీ సిబ్బంది దృష్టి సారించలేదు. దోమల వ్యాప్తి తీవ్రంగా ఉందని గ్రామస్థులు వాపోతున్నారు.
అంతుచిక్కని జ్వరాలు - అల్లాడుతున్న గిరిజనులు - Tribals Suffering with Fever