Rangarajan Attacked at Home : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్‌పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయనపై రెండు రోజుల క్రితం దాడి జరిగినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగరాజన్ ఇంట్లో ఉన్న సమయంలో 20 మంది వచ్చి దాడి చేసినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, అన్ని విషయాలు విచారణలో తెలుస్తాయని రంగరాజన్ చెప్పారు.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు : తనపై జరిగిన దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపిన ఆయన ఈ ఘటనపై పూర్తి వివరాలు చెప్పడానికి నిరాకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం (ఫిబ్రవరి 07న) కొంత మంది వ్యక్తులు రంగరాజన్ నివాసానికి వెళ్లారు. రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరగా ఆయన దానికి నిరాకరించారు. న్యాయపరంగా ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. దీంతో వాగ్వాదానికి దిగి ఆయనపై దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన ఆయన కుమారుడిపై కూడా దాడి చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.