3 Feets Punganuru Cow Cart in Konaseema District:కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం పశువులంక గ్రామంలో 3 అడుగులున్న పుంగనూరు గిత్త ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన కిరణ్ ఈ గిత్తను పెంచుకుంటున్నారు. కనుమ సందర్భంగా గిత్తను అందంగా అలంకరించిన చిన్న బండిని కట్టారు. దానిపై తన కుమార్తెలను కూర్చొబెట్టి ఊర్లో తిప్పారు. అలాగే మురమళ్లలో జరుగుతున్న కోడి పందేల బరి వద్ద స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు బండిపై కూర్చుని సవారి చేశారు.
కోనసీమ జిల్లాలో అంబరాన్నంటిన సంబరాలు
సంక్రాంతి సంబరాలు కోనసీమ జిల్లాలో అంబరాన్నంటాయి. మూడు రోజుల పాటు కోడిపందేలు, ఇతర వేడుకలు జరిగాయి. మూడో రోజు కనుమ పండుగ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభల ఉత్సవాలు సాగాయి. కోనసీమ జిల్లాలోని అంబాజీపేట, అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, కొత్తపేట, పి.గన్నవరం, మామిడికుదురు, రాజోలు, సఖినేటిపల్లి మండలాల్లోని 170 గ్రామాల్లో భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంగా ప్రభల తీర్థం సాగింది.