Biryani for 4 Rupees in Narsipatnam : బిర్యానీ ఆ మాట వినగానే అందిరికీ నోరూరుతుందంటే అతిశయోక్తి కాదు. సీజన్ ఏదైనా దీని హవా ఏమాత్రం తగ్గదు. పార్టీ ఏదైనా, గెస్ట్లు ఎవరైనా బిర్యానీ మస్ట్! వంట చేయడానికి బద్ధకంగా అనిపించినప్పుడు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టాలనుకున్నప్పుడు మొదటగా గుర్తొచ్చేది ఇదే! అంతలా భారతీయుల జీవనశైలిలో భాగమైపోయింది. పండగలు, ప్రత్యేక వేడుక రోజుల్లో బంధు మిత్రులు కలిసి దీన్ని ఆరగిస్తారు. బిర్యానీ క్రేజ్ అంటే అదే మరీ.
తాజాగా అనకాపల్లిలో హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకులు భారీ ఆఫర్ ప్రకటించారు. ఆ విధంగా నూతన వ్యాపారాన్ని మార్కెట్లో విశేష ప్రచారం కల్పించాలని దృక్పథంతో వారు వినూత్న ఆలోచనకు తెరతీశారు. రూ.4కే చికెన్ బిర్యానీ అని ప్రకటించారు. ఇంకేముంది ఈ ఆఫర్ గురించి తెలిసి ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. కొత్త సినిమా టికెట్ల కోసమో గుడిలో దర్శనాల కోసమో వేచి ఉన్నట్లు జనం బిర్యానీ కొనుగోలు చేయడానికి బారులు తీరారు. మరోవైపు ఆ హోటల్ ప్రాంతంలో వందలాది వాహనాలు పార్క్ చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.