Chandrababu Comments on CM YS Jagan: ప్రజల భూములపై వైఎస్ జగన్ పెత్తనమేంటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకంటూ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి, ఎన్టీఆర్ జిల్లా నూజివీడు, కాకినాడలో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడిన ఆయన వైసీపీపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతగా ముద్దులు పెట్టిన జగన్, అధికారంలోకి వచ్చాక ప్రజలపై పిడిగుద్దుల వర్షం కురిపించారని ఎద్దేవా చేశారు. తాను సంక్షేమ పథకాలు ఇవ్వలేదని జగన్ అంటున్నారు. బడ్జెట్‌లో 19 శాతం సంక్షేమానికి ఖర్చు చేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 శాతం మాత్రమే సంక్షేమానికి ఖర్చు చేసిందని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి రాగానే జే బ్రాండ్ మద్యం నిషేధిస్తామని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా నూజివీడులో భహిరంగ సభలో మాటాడిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. జగన్‌కు అభివృద్ధి తెలియదని, విధ్వంసమే తెలుసని ఎద్దేవాచేశారు. భూగర్భ వనరులు దోచుకున్నారని మండిపడ్డారు. నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని చాలా రోజులుగా పోరాడుతున్నారని, వారి కోరిక తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని వెల్లడించారు. ప్రజలకు రూ.10 ఇచ్చి రూ. 100 లాక్కున్నారని దుయ్యబట్టారు. మొదటి సంతకం మెగాడీఎస్సీపై, రెండో సంతకం ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు రద్దుపైనే అని మరోమారు స్పష్టం చేశారు.