ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో ప్రతి ప్రదేశాన్ని ఇన్నోవేషన్‌ హబ్‌గా తయారు చేస్తాం: సీఎం చంద్రబాబునాయుడు - CHANDRABABU IN DEEP TECH SUMMIT

ఏపీని నాలెడ్జ్‌ హబ్‌గా నిలబెట్టడమే లక్ష్యం - 2047 నాటికి వృద్ధి రేటు 15% ఉండాలి: సీఎం

chandrababu_attended_deep_tech_summit_in-visakhapatnam
chandrababu_attended_deep_tech_summit_in-visakhapatnam (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2024, 8:44 AM IST

Chandrababu Attended Deep Tech Summit in Visakhapatnam :శుక్రవారం విశాఖపట్నంలోని ఒక హోటల్‌లో ‘గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (జీఎఫ్‌ఎస్‌టీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నేషనల్‌ కాంక్లేవ్‌ ఆన్‌ డీప్‌ టెక్‌ ఇన్నోవేషన్‌’ సదస్సులో ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అందరూ టెక్నాలజీ పెరిగితే ఉద్యోగాలు తగ్గిపోతాయంటారు కానీ సాంకేతికత పెరిగే కొద్దీ ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, అత్యాధునిక సాంకేతికత కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి దోహదం చేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.

వీటన్నింటిలో ముందుండాలనే ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్‌ హబ్‌గా నిలబెట్టాలన్న లక్ష్యం పెట్టుకున్నానన్నారు. డీప్‌ టెక్‌తో ఉపాధి మార్గాలు, సంపదను సృష్టించగలమని వివరించారు. అభివృద్ధిలో మనల్ని వేగంగా నడిపించే ఈ సాంకేతికత కోసం మరిన్ని ప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

పేదరిక నిర్మూలన, నీటి నిర్వహణ, పీపీపీపీ విధానం, లాజిస్టిక్స్, గ్రీన్‌ అండ్‌ హైడ్రో ఎనర్జీ, జీరో బడ్జెట్‌ నేచర్‌ ఫార్మింగ్‌ వంటి పది ప్రణాళికా సూత్రాలను ప్రధానంగా తీసుకుని స్వర్ణాంధ్రప్రదేశ్‌ - 2047 విజన్‌ సిద్ధం చేస్తున్నామన్నారు. 2047కల్లా రాష్ట్రంలో వృద్ధి రేటు 15% ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

‘షేపింగ్‌ ది నెక్స్ట్‌ ఎరా ఆఫ్‌ గవర్నెన్స్‌’ అనే అంశంపై చర్చ అనంతరం సీఎం మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రతి ప్రదేశాన్ని ఇన్నోవేషన్‌ హబ్‌గా తయారు చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. దీనికి రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌గా పేరు పెడుతున్నామని స్పష్టం చేశారు. ఆయన జీవిత కాలంలో ఒక సామ్రాజ్యం సృష్టించారని, అందులో పదో వంతైనా మనం చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సదస్సుకు హాజరైన మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్, పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు (ETV Bharat)

అమరావతి కేంద్రంగా రాష్ట్రంలో ఐదు జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. జోన్‌-1లో ఉత్తరాంధ్ర జిల్లాలు, జోన్‌-2లో గోదావరి జిల్లాలు, జోన్‌-3లో ఉమ్మడి గుంటూరు, కృష్ణా, జోన్‌-4లో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, జోన్‌-5గా కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలుంటాయన్నారు. వీటిలో భారీ పరిశ్రమలు, విద్యాసంస్థలు, వెంచర్‌ క్యాపిటల్‌ తీసుకొస్తామని తెలిపారు. వీటి ద్వారా నాలెడ్జ్‌ ఎకానమీని సృష్టిస్తామన్నారు. ప్రస్తుతం ‘ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త’ విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు అన్నారు.

విశాఖ భవిష్యత్ నాలెడ్జ్ హబ్ - అధిక జనాభా మన ఆస్తి: సీఎం చంద్రబాబు

పీపీపీ మోడ్‌కు అదనంగా ఇంకో ‘పీ’ చేరింది:‘ఇప్పటి వరకు రహదారులు, విద్యుత్, కళాశాలలు ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో వస్తున్నాయి. వీటికి ప్రజలను(పీపుల్‌) కూడా కలిపి పీ-4 విధానాన్ని తీసుకొస్తాం. దీంతో పేదరికాన్ని నిర్మూలించవచ్చు. పైసా ఖర్చు చేయకుండా పీపీపీ విధానంలో కేవలం భూమి ఇచ్చి హైటెక్‌ సిటీ నిర్మించిన విషయం విదితమే. ఒకప్పుడు జనాభా నష్టం అన్నారు. ఇప్పుడు అదే మన ఆస్తి. అధిక సంపద కలిగినవారు పేదలను దత్తత తీసుకోవాలి. రాష్ట్రంలో నైపుణ్య గణన చేపడతాం. నైపుణ్యాలు లేనివారికి శిక్షణ ఇచ్చి, ఉపాధి మార్గాలు చూపిస్తాం’ అని చంద్రబాబు వివరించారు.

విద్యుత్‌ సంస్కరణలు తెచ్చా నా పవర్‌ పోయింది :విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తేవడానికి నేను ప్రయత్నిస్తుంటే అవి తీసుకొస్తే మీ భవిష్యత్‌కు సమస్య రావచ్చని కొందరు హెచ్చరించారు. 2004 నాటికి వాటిని విజయవంతంగా తీసుకొచ్చాను. అదే సమయంలో ‘నా పవర్‌ (పదవి) పోయింది’ అని చంద్రబాబు చమత్కరించడంతో ప్రాంగణంలో నవ్వులు విరిశాయి. అయితే సంస్కరణలు తీసుకురావడంలో ముందుండి నడిపించానన్న సంతృప్తి తనకు మిగిలిందని ఆయన పేర్కొన్నారు. సౌర, పవన్, పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామన్నారు. విశాఖలో గ్రీన్‌హైడ్రోజన్‌ ప్రాజెక్టులో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఎన్టీపీసీ- ఏపీజెన్‌కో మధ్య ఒప్పందం జరిగిందని చెప్పారు.

ఈ రోజు నేను విద్యార్థిని : నేను ఈ రోజు విద్యార్థిని. ఒక రోజంతా మీరు చెప్పేది వినడానికే కేటాయించాను. మీరు చెప్పేవాటిలో సామన్య ప్రజల జీవితం మెరుగుపడేలా ప్రభుత్వం ద్వారా చేయగలిగే అంశాలుంటే తక్షణమే అమలు చేస్తా అన్నారు. డీప్‌ టెక్‌ను అందరూ విస్తృత ప్రచారంలోకి తేవాలని కోరారు. మూడు నెలలకోసారి డీప్‌టెక్‌ మీద ఒక ఎగ్జిబిషన్‌ పెట్టుకుందామన్నారు. ఆకాశమే హద్దుగా అందరూ కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని చంద్రబాబు పేర్కొన్నారు.

అనంతరం వేదిక ముందు కూర్చొని ఓపికగా ఐదు గంటలపాటు ఐటీ, సైబర్, ఆరోగ్య రంగాల్లో నిపుణులు చెబుతున్న ఆలోచనలు విన్నారు. వీఎంఆర్డీఏలో సమీక్ష, టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశాలు ఉన్నప్పటికీ సీఎం వాటన్నింటినీ రద్దు చేసుకుని సమయం మొత్తం ఈ సదస్సుకే కేటాయించడం విశేషం.

సదస్సులో ‘స్వర్ణాంధ్ర అండ్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా టూ వికసిత్‌ భారత్‌‘, ‘ఏఐ ఫర్‌ ఎవ్రీ వన్‌’ అనే పుస్తకాలను చంద్రబాబు ఆవిష్కరించారు. మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్, జీఎఫ్‌ఎస్‌టీ డైరెక్టర్‌ కుటుంబరావు, వైస్‌ఛైర్మన్‌ ఎస్‌పీ ఠక్కర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, గణబాబు, కోండ్రు మురళి, వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు పాల్గొన్నారు.

ఏడు ఒప్పందాలు:విద్య, వైద్య రంగాల్లో టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్‌ స్టడీస్, మహిళా సాధికారత తదితర అంశాలపై జీఎఫ్‌ఎస్‌టీతో కలిసి పని చేయడానికి సమగ్ర, జీఎస్సార్, ప్లూయింట్‌ గ్రిడ్‌ లిమిటెడ్, గేమ్‌ కంపెనీ, జర్మన్‌ వర్సిటీలు ఏడు ఒప్పందాలు చేసుకున్నాయి.

ఐటీ ప్రోత్సాహకాలు నేడు జమ చేస్తాం:‘గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ అసమర్థ పాలన వల్ల తలెత్తిన సమస్యలన్నింటినీ సరిదిద్దుతున్నామని. ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి అన్ని సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని అన్నారు. ఎస్క్రో ఖాతాల్లో అన్ని ఐటీ ప్రోత్సాహకాలు శనివారమే జమ చేస్తామన్నారు. విశాఖ మెట్రోకు డీపీఆర్‌ తయారు చేసి పంపామన్నారు. రైల్వేజోన్‌ వస్తోందని, స్టీల్‌ ప్లాంటును కాపాడుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని వివరించారు. విశాఖలో సీ ప్లేన్‌ ప్రారంభానికి అనుకూలతలను పరిశీలిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

కొత్త ఆలోచనలతో రండి అద్భుతాలు సృష్టిద్దాం :‘రాష్ట్ర ప్రభుత్వం సమీకృత ఐటీ ఆధారిత సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం అన్ని రకాల వసతులతో అత్యుత్తమ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామన్నారు. సమాజానికి, సంపద వృద్ధికి ఉపయోగపడేలా వినూత్న ఆలోచనలతో రండి అద్భుతాలు సృష్టిద్దాం’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సుస్థిరాభివృద్ధికి సలహాలు, సూచనలు చేయాలని కోరగా కొంతమంది తమ అభిప్రాయాలను ఆయన ముందుంచారు.

ప్రశ్న: ప్రభుత్వ సేవలకు ఆటంకం లేకుండా ఆటోమేటిక్‌గా అందే వ్యవస్థను తీసుకువస్తే బాగుంటుంది. ప్రతిసారీ అధికారుల ధ్రువీకరణ ఎందుకు? -మనీష్‌ గుప్తా, సాప్‌ ల్యాబ్స్‌ డైరెక్టర్‌

సీఎం: నిజమే. జనన మరణాలు, కులం, స్థానికత ఇవేవీ తరచూ అప్‌డేట్‌ చేయాల్సిన అవసరం లేదు. అందుకే మేం వాట్సప్‌ గవర్నెన్స్‌ను తీసుకువస్తున్నాం. వంద రకాల సేవలు ఫోన్‌ ద్వారా పొందేలా రూపకల్పన చేస్తున్నాం. ఆధార్, ఫోన్‌ ఉంటే చాలు అన్ని రకాల ధ్రువపత్రాలు, సేవలు, సంక్షేమ పథకాలు పొందడానికి అనువైన వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.

ప్రశ్న: అంకుర సంస్థలన్నీ పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేసేందుకు నిధులిచ్చి, ప్రోత్సహించాలి. -పి.సెల్వం, ఎలక్ట్రానిక్స్, ఐటీ నిపుణులు

సీఎం: రాష్ట్రంలో కొన్ని సమస్యలున్నప్పటికీ ఐటీ సేవల విస్తరణకు మంచి ఎకో సిస్టం అభివృద్ధి చేస్తున్నాం. ఐదు జోన్లలో ఉన్న అన్ని జిల్లాలను సమానంగా వృద్ధిలోకి తీసుకుపోతాం. సెంట్రల్‌ హబ్‌ అమరావతిలో ఉంటుంది. రూ.500 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేశాం.

ప్రశ్న: ఆటిజం సమస్య ఎదుర్కొంటున్న పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. మా ఇన్‌స్టిట్యూట్‌కే రోజూ 10 నుంచి 16 మంది వస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాలో స్పీచ్, హియరింగ్‌కు సంబంధించిన కళాశాల లేదు. వాటిని బోధించే నిపుణులను వర్చువల్‌గా తీసుకుని రాగలిగితే పిల్లలకు సాయం చేసినవారవుతారు. -జి.లక్ష్మి, స్పీచ్, హియరింగ్‌ నిపుణులు

సీఎం:దీనికి వైద్యారోగ్యశాఖ కార్యదర్శి కృష్ణబాబు సమాధానం చెప్పాలి. ఈ సమస్య గురించి ఆలోచించారా? రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఇలాంటి సమస్యతో ఉన్నారు? వారికి ఉపయోగపడే సలహా ఆమె ఇచ్చారు. కళాశాల ఏర్పాటు, నిపుణులను తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోండి.

'టెక్నాలజీ అనేది ఒక విప్లవం లాంటిది. 1996లో ఐటీ గురించి మాట్లాడిన నేను, ఇప్పుడు డీప్‌ టెక్‌ గురించి మాట్లాడటం సంతోషంగా ఉంది. డీప్‌టెక్‌లో ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), బ్లాక్‌ చెయిన్, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి విధానాలు వచ్చాయి. వీటన్నింటినీ ఇప్పుడు ఎలా ఉపయోగించాలనేది చాలా ముఖ్యం. వర్చువల్, ఫిజికల్‌ వర్కింగ్‌లో ఉపాధిని సృష్టించడానికి కో-వర్కింగ్‌ స్టేషన్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం.'-ముఖ్యమంత్రి చంద్రబాబు

ఏపీలో జనాభా పెంచేందుకు కృషి - జపాన్, చైనా, ఆస్ట్రేలియా విధానాల పరిశీలన

ABOUT THE AUTHOR

...view details