Chandrababu and Lokesh on Family Suicide Incident in Kadapa District:వైసీపీ ప్రభుత్వ దాష్టీకానికి చేనేత కుటుంబం బలైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రెవెన్యూ సిబ్బంది ద్వారా వైసీపీ నాయకులు చేసిన అధికారిక భూ కబ్జా నిండు కుటుంబం ఉసురు తీసిందని వాపోయారు. రికార్డుల్లో పేర్లు మార్చిన వైసీపీ భూ బకాసురులతో పోరాడలేక పేద బీసీ కుటుంబం బలవంతంగా ప్రాణాలు తీసుకుందన్నారు. మాటలకు అందని ఈ విషాధం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ ఆందోళనలో పడేస్తోందని చంద్రబాబు ఆక్షేపించారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం, కొత్త మాధవరంలో చోటు చేసుకున్న ఈ దారుణంపై ఏ సమాధానం చెపుతావు జగన్ అని ప్రశ్నించారు. ఎంత కష్టం, ఎంత ఆవేదన, ఎంత క్షోభ ఉంటే ఓ నిండు కుటుంబం ఇలా ప్రాణాలు తీసుకుంటుందో వైసీపీ కబ్జాకోరులకు తెలుసా అని నిలదీశారు. సొంత జిల్లాలో చోటు చేసుకున్న ఈ అమానవీయ ఘటనపై జగన్ రెడ్డి తక్షణమే స్పందించి, కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎక్కడ గంజాయి కేసులైనా మూలాలు ఏపీలోనే:ఏపీలోని గంజాయి మాఫియా మన రాష్ట్ర ప్రజలనే కాదు పొరుగు రాష్ట్రాల వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం, జగిత్యాలలో గంజాయి ముఠా అరెస్ట్ సమయంలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెర పరిచాయన్నారు. గంజాయి విక్రయిస్తున్న ఈ ముఠాకి విశాఖలోని సీలేరు నుంచి గంజాయి సరఫరా కావడం ఎంతో ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. మన రాష్ట్రంలో గంజాయి అమ్మకాల గురించి పొరుగు రాష్ట్ర పోలీసులు చెపుతుంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ ఏ గంజాయి కేసులైనా మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉండటం జగన్ రెడ్డి పాలనా దౌర్భాగ్యమని మండిపడ్డారు. నిన్ననే 25,000 కిలోల డ్రగ్స్ విశాఖ పోర్టులో పట్టుబడ్డాయి. రాష్ట్రాన్ని ఇలా అభాసుపాలు చేసిన జగన్ గ్యాంగ్ పాపాలకు ప్రజలే శిక్ష విధిస్తారని వెల్లడించారు. నాడు అభివృద్దిలో దేశంలో వెలిగిన మన రాష్ట్రం నేడు గంజాయితో చీకట్లలోకి వెళ్లిపోయిందని దుయ్యబట్టారు.