Central Government Releases Rs 2800 Crore to Polavaram Project :పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అడ్వాన్సుగా నిధులిచ్చేందుకు కేంద్రం తొలిసారి అంగీకరించడమే కాకుండా, ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమవారం బడ్జెట్ విడుదలకు ఉత్తర్వులిచ్చారు. తొలి విడతగా సుమారు రూ.2,800 కోట్ల మంజూరుకు సమ్మతించారు. ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి ‘అడ్వాన్స్’ పద్దు కింద అందనున్నాయి.
మరోవైపు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను నవంబరు నుంచి ప్రారంభించేందుకు జలవనరుల శాఖ సిద్ధమవుతోంది. అక్టోబరు చివర్లో లేదా నవంబరు తొలి వారంలో ప్రాజెక్టు వద్దే కీలక సమావేశం జరగనుంది. విదేశీ నిపుణులు, కేంద్ర జలసంఘం, పోలవరం అథారిటీ, ప్రాజెక్టు అధికారులు పాల్గొని సాంకేతిక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారు. ప్రస్తుతం కొత్త డయాఫ్రం వాల్ డిజైన్ రూపకల్పన, నిర్మాణ షెడ్యూలు తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. వచ్చే ఏడాది జులై నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు.
తొలిదశకు రూ.14,237 కోట్లు అవసరం :పోలవరం ప్రాజెక్టు తొలి దశకు అవసరమైన మేర నిధులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే డీపీఆర్‌ను ఆమోదించింది. అదే సమయంలో అడ్వాన్సుగా ఇచ్చేందుకు కూడా సమ్మతించింది. గతంలో నాబార్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకుని పనులు చేయించేది. గుత్తేదారులకు ఆ బిల్లులు చెల్లించిన తర్వాత అంతే మొత్తాన్ని కేంద్రం రీయింబర్స్ చేస్తూ వచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం 3.0లో ఈ సంక్లిష్టతను తొలగించారు. కేంద్ర జల్‌శక్తి ప్రత్యేక గ్రాంటులోనే పోలవరానికి నిధులు కేటాయించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.