ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి ఓఆర్‌ఆర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - పలు కీలక ప్రాజెక్టులకూ ఆమోదం - Central on Amaravati ORR

Amaravati ORR Updates : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాజధాని అమరావతి దశ తిరుగుతోంది. రాజధాని అమరావతికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. వాటిలో 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు సహా కీలక ప్రాజెక్టులున్నాయి. వీటిని 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం చేపట్టి, కొంత ముందుకు తీసుకెళ్లాక, జగన్‌ సర్కార్ అటకెక్కించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నిటినీ మళ్లీ కేంద్రం ముందుంచి, ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 6, 2024, 7:42 AM IST

Updated : Jul 6, 2024, 8:22 AM IST

Amaravati ORR Updates
Amaravati ORR Updates (ETv Bharat)

Central Green Signal on Amaravati ORR : చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, తొలి దిల్లీ పర్యటనలోనే కేంద్రం నుంచి రాష్ట్రానికి మేలు జరిగేలా చేశారు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో గురువారం జరిపిన భేటీలో రాజధాని అమరావతి అనుసంధానించే పలు రహదారులకు ప్రాథమిక ఆమోదం లభించింది. అమరావతి ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టుకు భూసేకరణ సహా మొత్తం రూ.20,000ల నుంచి రూ.25,000ల కోట్లకుపైగా నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.

Approval Vijayawada East Bypass Road : విజయవాడ తూర్పు బైపాస్‌ రోడ్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్‌ ఫైనాన్షియల్‌ కమిటీతో పాటు, ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం పొందాక అవన్నీ ఆచరణలోకి వస్తాయి. ఇప్పుడు ప్రాథమిక ఆమోదం పొందినవన్నీ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలే! ఈ ప్రాజెక్టులు సాకారమైతే మిగతా ప్రాంతాలతో అమరావతికి చాలా సులువైన, మెరుగైన కనెక్టివిటీ ఏర్పాటు కానుంది.

ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం :అమరావతి, హైదరాబాద్‌ మధ్య మెరుగైన అనుసంధానం కోసం ఇప్పుడున్న జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా, 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం తగ్గేలా ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా సమ్మతించింది. శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ నుంచి మేదరమెట్ల వరకు తలపెట్టిన ఎక్స్‌ప్రెస్‌వేని అమరావతితో అనుసంధానిస్తూ, మేదరమెట్ల-అమరావతి మధ్య 90 కిలో మీటర్ల పొడవైన గ్రీన్‌ఫీల్డ్‌ హైవేని నిర్మించాలన్న ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించింది.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ప్రతిపాదన విరమణ :ఓఆర్‌ఆర్‌ సహా ఈ రహదారుల నిర్మాణం మొదలైతే రెండు మూడు సంవత్సరాల్లోనే సమూల మార్పులు వస్తాయి. రాజధాని అమరావతితో పాటు, మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రమే మారిపోతుంది. మౌలిక వసతుల కల్పన వేగం పుంజుకుంటుంది. అభివృద్ధి పరుగులు తీస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. అమరావతికి మెరుగైన అనుసంధానత ఏర్పడితే, పెట్టుబడిదారులు క్యూకడతారు. లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. అదే సమయంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది.

ఓఆర్​ఆర్​పై కేంద్రాన్ని ఒప్పించిన చంద్రబాబు : అమరావతితో పాటు, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే, ఆర్థిక కార్యకలాపాలకు చోదకశక్తిగా నిలిచే ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టుకు కేంద్రం డీపీఆర్‌ను ఆమోదించి, భూసేకరణ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌, అమరావతిపై కక్షతో ఔటర్ రింగ్ రోడ్డును అటకెక్కించారు. అమరావతికి ఓఆర్ఆర్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంచేశారు. తొలి దిల్లీ పర్యటనలోనే చంద్రబాబు బాహ్య వలయ రహదారిపై కేంద్రాన్ని ఒప్పించారు.

గతంలో ఇందుకు అవసరమైన భూసేకరణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని షరతు పెట్టిన కేంద్రం, ఇప్పుడు మొత్తం వ్యయాన్ని భరించేందుకు ముందుకు వచ్చింది. ఓఆర్‌ఆర్‌ని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఆర్డీఏ పరిధిలో 189 కిలో మీటర్ల పొడవున, ఆరు వరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తారు. రెండు పక్కలా సర్వీసు రోడ్లు ఉంటాయి. రహదారి వెడల్పు 150 మీటర్లు ఉంటాయి.

మచిలీపట్నంలో రూ.60వేల కోట్లతో బీపీసీఎల్‌ రిఫైనరీ - త్వరలోనే అధికారిక ప్రకటన - Chandrababu Meet Central Ministers

సులభంగా రాయలసీమ నుంచి అమరావతికి : అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అనంతపురం-అమరావతి మధ్య 393 కిలోమీటర్లతో యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేని తలపెట్టింది. కానీ జగన్‌ ప్రభుత్వం అనేక మార్పులు చేసి, చివరకు వైఎస్సార్‌ జిల్లాలోని పులివెందుల మీదుగా తిప్పింది. శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ సమీపంలో మొదలయ్యే ఆ రహదారిని, బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం వద్ద చెన్నై-కోల్‌కతా ఎన్‌హెచ్‌లో కలిసేలా పరిమితం చేసింది.

ఆ రహదారికి ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు కూడా అప్పగించింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నుంచి ముప్పవరం వరకు 90 కిలో మీటర్ల మేర కొత్తగా గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మించాలన్న ప్రతిపాదనను కేంద్రం ముందుంచింది. దాని వల్ల బెంగళూరు, రాయలసీమతో పాటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చేవారు, ముప్పవరం నుంచి నేరుగా అమరావతి చేరుకోవచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అనంతపురం-అమరావతి మధ్య ప్రతిపాదించిన ఎక్స్‌ప్రెస్‌వేకి కేంద్రం ఆమోదం తెలిపి, ఎన్‌హెచ్‌-544 ఎఫ్‌ అనే సంఖ్యనూ కేటాయించింది. భూసేకరణకు ప్రక్రియ మొదలు పెట్టి, పెగ్‌మార్కింగ్‌ చేశారు. జగన్‌ సర్కార్ ఆ రహదారిని అమరావతి వరకు తీసుకురాకుండా చిలకలూరిపేట వద్ద నిర్మిస్తున్న చెన్నై-కోల్‌కతా హైవే బైపాస్‌లో కలిపేలా మార్పులు చేసింది. దాని ప్రకారం డీపీఆర్‌లు సిద్ధమయ్యాక దాన్నీ పక్కనపెట్టింది.

తెరపైకి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రతిపాదన :ఆ తర్వాత వైఎస్సార్‌ జిల్లా మీదుగా కోడూరు-ముప్పవరం మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులో బెంగళూరు-హైదరాబాద్‌ హైవేపై, కొడికొండ సమీపంలోని కోడూరు వద్ద మొదలై, ముప్పవరం వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలో కలిసేలా ప్రతిపాదనలు రూపొందించారు. 344 కిలో మీటర్ల ఆ రహదారికి బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే అని పేరు పెట్టారు.

రాయలసీమ నుంచి రాజధానికి పెరగనున్న అనుసంధానం :ఆ రహదారిలో రాయలసీమ నుంచి వచ్చేవారు అమరావతి చేరుకోవాలంటే, ముప్పవరం నుంచి చెన్నై-కోల్‌కతా హైవేలో చిలకలూరిపేట మీదుగా గుంటూరు, మంగళగిరి దాటుకొని వెళ్లాలి. రాయలసీమ నుంచి వచ్చేవారికి మెరుగైన అనుసంధానం కోసం, ముప్పవరం నుంచి అమరావతి వరకు 90 కిలో మీటర్ల రహదారిని చంద్రబాబు ప్రతిపాదించారు.

తూర్పు బైపాస్‌తో తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు : విజయవాడ తూర్పు బైపాస్‌ రహదారిని సుమారు 49 కిలో మీటర్ల మేర నాలుగు వరుసలుగా నిర్మించాలన్న ప్రతిపాదనకు, కేంద్ర మంత్రి గడ్కరీ ఆమోదం తెలిపారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి, విజయవాడ చుట్టూ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించాలనుకుంది. అప్పటికి విజయవాడ పశ్చిమ బైపాస్‌ రహదారి నిర్మాణం మొదలవలేదు. విజయవాడకు పశ్చిమం వైపున చిన్నఅవుటపల్లి నుంచి కాజ వరకు వరకు 47.8 కిలో మీటర్ల ఆరు వరుసల రహదారి నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చింది.

దీంతో ప్రస్తుతానికి రాజధాని ఐఆర్‌ఆర్‌ ప్రతిపాదనను ఉపసంహరించుకొని, విజయవాడ తూర్పు బైపాస్‌ రహదారి ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. విజయవాడ పశ్చిమ రహదారి నిర్మాణం రాజధాని అమరావతి మీదుగానే జరుగుతోంది. తూర్పు బైపాస్‌ కూడా పూర్తయితే అమరావతి మీదుగా విజయవాడ చుట్టూ రింగ్‌ రోడ్డు ఏర్పాటవుతుంది.

విజయవాడ-హైదరాబాద్‌ మధ్య ప్రస్తుతం 270.7 కిలో మీటర్ల పొడవైన జాతీయ రహదారి ఉంది. దాన్ని ఆరు వరుసలకు విస్తరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. అమరావతి-హైదరాబాద్‌ మధ్య దూరం తగ్గించేందుకు, నేరుగా కనెక్టివిటీ ఏర్పడేందుకు, గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దేశంలో ప్రస్తుతం వేల కోట్ల రూపాయల వ్యయంతో 20కి పైగా ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం జరుగుతోంది.

అమరావతి-హైదరాబాద్‌ మధ్య 60-70 కి.మీ. దూరం తగ్గేలా ఎక్స్‌ప్రెస్‌వే : హైదరాబాద్, అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌వే హామీ విభజన చట్టంలోనూ ఉంది. ఏపీ సర్కార్ విజ్ఞప్తి మేరకు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి గడ్కరీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అమరావతి-హైదరాబాద్‌ మధ్య 201 నుంచి 220 కిలో మీటర్ల పొడవున ఆ రహదారి నిర్మాణం ప్రతిపాదన సాకారమైతే, ఇప్పుడున్న హైవేపై ఒత్తిడి తగ్గుతుంది. అమరావతి-హైదరాబాద్‌ మధ్య దూరం 60 నుంచి 70 కిలోమీటర్ల వరకూ తగ్గనుంది.

ఐదేళ్లపాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తాం: సీఎం చంద్రబాబు - CM Chandrababu naidu Chit Chat

Last Updated : Jul 6, 2024, 8:22 AM IST

ABOUT THE AUTHOR

...view details