Central Cabinet approves Kendriya Vidyalayas in AP: దేశ వ్యాప్తంగా నూతనంగా 85 కేంద్రీయ విద్యాలయాలు (Kendriya Vidyalayas), 28 నవోదయ విద్యాలయాల (Navodaya Vidyalays)ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ నూతన కేంద్రీయ విద్యాలయాల ద్వారా దేశ వ్యాప్తంగా దాదాపు 82 వేల మందికి పైగా విద్యార్థులకు ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య అందనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయాలు ఇవే:అనకాపల్లి, చిత్తూరులోని వలసపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లె, రొంపిచర్ల, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, నూజివీడు, నంద్యాల జిల్లాలోని డోన్‌లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు:తెలంగాణకు కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాలను కేంద్రం ప్రకటించింది. తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలో నవోదయా విద్యాలయాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.