Catering Calls Issue in Hyderabad : క్యాటరింగ్ బిజినెస్ చేస్తూ, వేధింపులకు పాల్పడుతున్న వున్నూరు స్వామి అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ (Cyber Crime) డీసీపీ ధార కవిత తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో క్యాటరింగ్ చేసినందుకు రూ.7వేలకు ఓ కస్టమర్ వద్ద నిందితుడు ఒప్పందం చేసుకున్నాడు. కార్యక్రమం ముగిసిన తర్వాత రూ.15వేలు ఇవ్వాలని బాధితుడిని డిమాండ్ చేశాడు.
అతడు అదనపు డబ్బులు ఇవ్వకపోవడంతో వారికి సంబంధించిన నంబర్లను అనధికార సైట్లలో పెట్టడం, కాల్ గర్ల్స్ కోసం వీరిని సంప్రదించండి అంటూ, నిందితుడు సామాజిక మధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అంతేగాక పబ్లిక్ టాయిలెట్స్, మెట్రో పిల్లర్ల(Metro Pillars) వద్ద కూడా ఇలాగే నంబర్లు రాయడంతో గంటల వ్యవధిలోనే బాధితుడికి వందల ఫోన్లు వచ్చాయి. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి, నిందితుడిని అదపులోకి తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.
"క్యాటరింగ్ సర్వీస్ కావాలంటే ఫలానా నంబర్‌కు కాంటాక్ట్ అవ్వండి అని ప్రకటనలు చేస్తుంటారు. శుభకార్యాలకు పలు కార్యక్రమాల కోసం క్యాటరింగ్ కావాల్సిన కస్టమర్లు, వీరిని సంప్రదిస్తుంటారు. అయితే వారి నంబర్లను జాగ్రత్తపరచుకొని, ఈవెంట్ అయిపోయిన తరవాత ఒప్పంద సొమ్ము కంటే అధికంగా డిమాండ్ చేస్తారు. ఇవ్వకుంటే వారి నంబర్లను సోషల్ మీడియాల్లో, కాల్ గర్ల్స్ కోసం ఈ నంబర్లను సంప్రదించండి అంటూ ఎక్కడపడితే అక్కడ పోస్ట్ చేస్తారు. ఇలా వేధింపులకు గురిచేస్తూ ఒకరకమైన మెంటల్ టార్చర్‌ను కలుగజేస్తారు. బాధితుడు ఫిర్యాదు మేరకు, నిందితుడును అరెస్ట్ చేయడం జరిగింది." -ధార కవిత, సైబర్‌క్రైమ్ డీసీపీ